చింతలమానేపల్లి, ఆగస్టు 11 : మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి దిందా-కేతిని, శివపెల్లి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం కేతిని రైతులు దిందా శివారులోకి, దిందా రైతులు కేతిని శివారులోకి వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి తమ గ్రామాలకు వస్తున్న క్రమంలో వాగులు ఉప్పొంగాయి. దీంతో వాటిని దాటలేక ఎక్కడి కూలీలు.. రైతులు అక్కడే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ఇక కొందరు శివపల్లి గ్రామస్తులు గూడెంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న తమ పిల్లలను చూసి తిరిగి వస్తుండగా, శివపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడే ఆగిపోయారు. రాత్రి దిందా-కేతిని వాగుల ఉధృతి తగ్గగా, స్థానిక నాయకులు ట్రాక్టర్ల ద్వారా ఆయా గ్రామాల రైతులను దాటించారు. ఇక గూడెం వెళ్లిన శివపల్లి గ్రామస్తులు, గూడెంలోనే ఉన్నట్లు తెలిసింది.
రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కరించాలి
Adilabad2
కాగజ్‌నగర్, ఆగస్టు 11: మండలంలోని వంజీరి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం వంజీరి రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం అధికారులు, విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలతో రెండు నెలలుగా వంజీరి రైల్వే అండర్ బ్రిడ్జి కింద బురదమయమైందని, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నా ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు రాజ్‌కుమార్, ఓదె లు, సలీం. రాజు, రావూజీ పాల్గొన్నారు.
పోరాట యోధుడు గద్దర్
కాగజ్‌నగర్, ఆగష్టు 11: ప్రజాయుద్ధ నౌక గద్దర్ అణగారిన వర్గాల పోరాట యోధుడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన గద్దర్ సంస్మరణ సభకు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభ నిర్వాహకులు రాజయ్య, జయదేశ్ అబ్రహం, రాజ్కమాలాకర్రెడ్డి, నాయకులు గణపతి, లెండుగూరే శ్యాంరావు, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు శాంతికుమారి, మేడి చరణ్‌దాస్, ఏటూకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.