నేరడిగొండ, జనవరి 16 : ఎవరైనా కలప అక్రమంగా తరలిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఇచ్చోడ ఎఫ్‌డీవో బర్నోబా హెచ్చరించారు. నేరడిగొండ అటవీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. టేకు కలప తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో నేరడిగొండ రేంజ్ అధికారి గణేశ్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది అప్రమత్తమై వాహనాలపై నిఘా ఉంచారు. బోరిగాం అటవీ ప్రాం తం నుంచి కలప వాహనాలు వెళ్తుండగా బంధంరేగడి వద్ద పట్టుకున్నారు. రెండు వాహనాల్లో 19 టేకు దుంగలు తీసుకెళ్తున్నారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
నిజామాబాద్‌కు చెంది ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. ఇందులో జావీద్‌ఖాన్, మిర్జిమహబూబ్, షేక్ అఫ్రోజ్, షేక్ షాబుద్దీన్, పటాన్ఖాన్, సుల్తాన్ ను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. అంతే కాకుండా స్మగ్లర్లు అటవీ అధికారులపై దాడికి యత్నించారని, అందులో 25 మంది ఉన్నారని వివరించారు. అధికారులు, సిబ్బంది కేకలు వేయడంతో పారిపోయారని వెల్లడించారు. ఎఫ్ఆర్వో గణేశ్ చాకచక్యంగా వ్యవహరించడంతో అక్రమ రవాణాను అరికట్టినట్లు తెలిపారు. ఎఫ్ఆర్వోను ఆయన అభినందించారు. ఇందులో డిప్యూటీ రేంజ్ అధికారి ముక్తార్ అహ్మద్, ఎఫ్ఎస్వో శ్రీకాంత్, ఎఫ్‌బీవో రహీజ్, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.