ఉట్నూర్ రూరల్, మే 29: ఇప్పటికే లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 13 కిలోల కోత విధిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఉట్నూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల చొప్పున రైస్ మిల్లర్లు కోత విధించేవారని తెలిపారు. కానీ ఈ యాసంగిలో మొదటి రెండు లోడులకు క్వింటాలుకు 8 కిలోలు, ఆ తర్వాత లోడులకు 10 కిలోలు, ప్రస్తుతం బీ గ్రేడ్ కింద తీసుకొని క్వింటాలుకు 13 కిలోలు కోత విధిస్తున్నారని తెలిపారు.
క్వింటాలుకు 320 రూపాయల చొప్పున నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లో కంటే దళారులకు విక్రయిస్తే కనీసం కూలీల, తదితర ఖర్చులైనా మిగులుతాయని, లారీల, గన్నీ సంచుల కొరతతో రోజుల తరబడి పడిగాపులు కాసే బాధలు తప్పుతాయన్నారు. అప్పులు తెచ్చి 6 నెలలు కష్టపడి సాగు చేసిన పంటను రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా కోతలు విధిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను సంబంధిత డీఎం, డీఎస్వో, ఐకేపీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రాస్తారోకో విషయం తెలుసుకొని తహసీల్దార్ అక్కడికి చేరుకొని జిల్లా కలెక్టర్‌తో రైతులతో ఫోన్లో మాట్లాడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
8 ఎకరాలో సన్న రకం వరి సాగు చేశాను. ధాన్యం తీసిన కొనుగోళ్లు కేంద్రానికి తీసుకచ్చాను. 250 క్వింటాళ్లు తూకం వేసి రైస్ మిల్కు పంపారు. మరో 50 కింటాళ్లు తూకం వేయాల్సి ఉంది. రైస్ మిల్కు పంపిన వడ్లను మిల్లు యజమాని క్వింటాలుకు 13 కిలోల చొప్పున అదనంగా ఇస్తేనే తీసుకుంటానని ఐకేపీ సిబ్బంది ద్వారా రైతులను బలవంతం పెడుతున్నారని చెప్పారు. అధికారులకు, జిల్లా కలెక్టర్ నేరుగా చెప్పినా చర్యలు ఎందు తీసుకోవడం లేదు.
– సాడిగే రాజేశ్వర్, రైతు, గంగన్నపేట్
7 ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు చేసిన. వరి కోసి కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి 10 రోజులవుతున్నది. రైస్ మిల్లర్లు క్వింటాలుకు 10 నుంచి 15 కిలోల వరకు కోత విధిస్తే మాకు మిగిలేది ఏమున్నది. ఈ లెక్కన దళారులే నయం. దళారులతో మోసపోవద్దని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మిల్లర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
-బానోత్ జితేందర్, రైతు, ఉట్నూర్