ఇచ్చోడ, జూన్ 29 ః నకిలీ ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రాలను తయారు చేసే ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ తెలిపారు. ఆదివారం ఇచ్చోడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఈనెల 25న సహని సూరజ్ ఇస్లాంనగర్ గ్రామం అని తప్పుడు ని వాస ధ్రువీకరణ సర్టిఫికెట్ సృష్టించి సీఐఎస్ఎఫ్లో ఉద్యోగం సాధించాడు. పోలీసు వెరిఫికేషన్లో భాగంగా అతన్ని చిరునామా తప్పు గా తేలిందన్నారు.
అయితే అతను వాస్తవంగా ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందినవారన్నారు. పేరొన్న ఇంటి నంబర్ 48-2-2, ఇస్లాంనగర్ ఇంటి నంబరు సరిగా లేదన్న తర్వాత, వివిధ కోణాలలో విచారించగా విషయం బయటపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన తొమ్మిది మంది ఇచ్చోడలో కొందరూ వ్యక్తులను సంప్రదించి వారికి ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాల్సిందిగా ఒకొకరికి రూ.లక్ష చొప్పున మాట్లాడుకున్నారు. మొ దటగా దీపక్ తివారీ అనునతడు ఆధార్ కార్డు రూ.4 వేలకు చేసి, నివాస ధ్రువీకరణ పత్రంపై పంచాయతీ సెక్రెటరీ వద్దకు వెళ్లగా, పంచాయతీ సెక్రటరీ గ్రామస్తులు కాదని సంతకం చేయలేదన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని, ఇస్లాంనగర్ మాజీ సర్పంచ్ భార్యాభర్తలు షేక్ ఫరీద్, షేక్ ఖలీం కలిసి, పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి, మీ సేవలో ఐప్లె చేసి తప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందారన్నారు. దీపక్ తివారీ ఉద్యోగంలో చేరిన తర్వాత మిగిలిన ఎనిమిది మంది కూడా ఇలానే చేసి, మీ సేవలో ఐప్లె చేశారన్నారు. సర్టిఫికెట్లను వెరిఫై చేసినప్పుడు వారు ఇస్లాంనగర్ వారికి కాదని నిర్ధారణ అయిందన్నారు. అయినప్పటికీ షేక్ ఫరీద్, షేక్ ఖలీం కలిసి మిగిలిన వారికి కూడా తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు సృష్టించి ఇచ్చారన్నారు.
దీనికిగాను రూ.9 లక్షలకు ఒప్పందమై, ఇందులో రూ.3 లక్షలు ఈ ఇద్దరికి వచ్చినట్టు తెలిపారు. మిగిలిన రూ.6 లక్షలు ఉత్తరప్రదేశ్లోని హుర్లిక్ వద్ద ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న జాదవ్ గజానంద్(ఇస్లామ్నగర్ వాసి) వీరిని బెదిరించి డబ్బు కొట్టడానికి ప్రయత్నించగా, షేక్ ఖలీం, ఫరీద్ అతనికి రూ.20 వేలు ఇచ్చారన్నారు.
తప్పుడు పత్రాలు తయారు చేసిన షేక్ ఫరీద్, షేక్ ఖలీం, ఈ విషయం తెలిసినప్పటికీ దాచి డబ్బులు తీసుకున్న జాదవ్ గజానంద్ను ఈనెల 28న రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. నిందితులు ఇతర రాష్ర్టాల వారికి ఆ సర్టిఫికెట్లను అందజేసి కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగాలలో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రోత్సహించారన్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్లతో వారందరూ ఉద్యోగాలు సాధించి, ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వహిస్తున్నారన్నారు. విచారణ వారిపై కూడా కొనసాగుతుందని, మిగిలిన విషయాలు త్వరలో తెలియజేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.