కుభీర్ : ఇందిరమ్మ ఇల్లు ( Indiramma Houses ) మంజూరు చేస్తామంటూ కొందరు దళారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ( MLA Pawar Ramarao Patel) తెలిపారు. దళారులను ( Middlemen) నమ్మి మోసపోవద్దని కోరారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గురువారం భవిత కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం జడ్పీ హైస్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యా సంస్థలను పరిశీలించారు. రూ. 10 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన గ్రామైక్య సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలను అందజేసి మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామ న్నారు. అర్హులైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇళ్ల మంజూరు పేరుతో దళారులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని ఎమ్మెల్యే లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందూరి సాయినాథ్, ఎంపీడీవో భూమారావు, ఏపీవో హరిలాల్, ఐకెపీ ఏపీఎం దత్తాత్రి, భూమన్న, హై స్కూల్ హెచ్ఎం సట్ల గంగాధర్, నాయకులు ఏశాల దత్తాత్రి, విట్టల్, మోహన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు తోకల మారుతి, సర్పంచులు, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.