దండేపల్లి, ఫిబ్రవరి 25 : చివరి ఆయకట్టు వరకూ సాగు నీరందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రీబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. కడెం ప్రధాన కాలువలోకి దిగి మోకాలి లోతు వరకు కూడా సరిగా సాగు నీరందడం లేదని చూపించారు. పంటల ప్రారంభానికి ముందు సరిపడా నీళ్లిస్తామన్నా అధికారులు.. తీరా పంటలు వేసుకున్నాక చేతులెత్తేశారని మండిపడ్డారు.
పంట ప్రారంభం నుంచి ఎనిమిది తడులు నీరందిస్తామన్నారని, ఇప్పటి వరకు 4 తడులే అందించారని, వాటిలో 2 తడులు మాత్రమే సరిగ్గా అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరందక వరి, మక్క పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడెం ప్రధాన కాలువ సమీపంలో ఉన్న తమ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా రైతుల దుస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. బావుల్లో కూడా నీరు ఇంకిపోతుందని, ఇలాగైతే పంటలెలా చేతికొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏఈఈ శ్రావణ్ అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెట్టుబడి కూడా పోయేటట్టే ఉంది
యాసంగిల 4 ఎకరాల్లో వరి, 2 ఎకరాల్లో మక్క వేసిన. కడెం నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు. బావుల్లో నీళ్లు ఇంకిపోతున్నయ్. పెట్టుబడి కూడా పోయేటట్టే ఉంది. కనీసం ఎకరం పొలం కూడా పండుతదన్న ఆశ లేదు. మిగతా నాలుగు తడులు సక్రమంగా ఇస్తేనే పంటలు దక్కుతాయి.
– సిందం సత్తయ్య, రైతు, తాళ్లపేట
సక్రమంగా నీళ్లివ్వాలే
యాసంగిల 3 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మక్క వేసిన. ముందేమో నీళ్లిస్తమని సార్లు చెప్పిన్రు. ఇప్పుడేమో నామమాత్రంగా ఇస్తున్నరు. పంట మొదట్లనే ఇట్లా ఉంటే ఎట్లా. గిట్లయితే పంట చేతికొస్తదన్న నమ్మకం లేదు. ఇప్పటికైనా సర్కారు, అధికారులు రైతుల గురించి ఆలోచించాలే. సక్రమంగా నీళ్లివ్వాలే.
– జెల్లపెల్లి శ్రీనివాస్,రైతు, గొల్లగూడెం