దండేపల్లి, నవంబర్ 13: దండేపల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్, నంబాల, వెల్గనూర్ కేంద్రాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో బియ్యం నిల్వ కేంద్రాలను పెట్టుకొని ఆటోలు, మినీ వ్యాన్లు, బొలేరో వాహనాల్లో నింపి, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారులు లక్షల్లో అక్రమార్జన చేస్తున్నారు. అక్రమ బియ్యం వ్యాపారంపై గతంలో అధికారులకు దండేపల్లి గ్రామస్తులు వినతిపత్రాలు అందించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం అక్రమ దందాపై పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు జారీ చేసి వారికి ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. తొలుత రూ.2కిలో బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత కరోనా కష్టకాలం నుంచి రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది. పేదల ఆకలి తీర్చాలనే ఆశయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. సివిల్ సైప్లె శాఖలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నది.
రేషన్ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ పాస్, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. దందాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మొక్కుబడి దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దండేపల్లి మండలంలోని నంబాల నుంచి సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా గూడెంలో స్థానికులతో పాటు నాయకులు మినీ వ్యాన్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. బియ్యం వ్యాన్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రూ.10కు కొని…రూ.20కు అమ్మి..
రేషన్ బియ్యం దందాలో లబ్ధిదారుల నుంచే ప్రాథమికంగా తప్పుడు మార్గం ప్రారంభమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం తినడానికి అలవాటు పడ్డ రేషన్‌కార్డుదారులు తమకు వస్తున్న దొడ్డు బియ్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నారు. దళారులు ప్రతి ఇంటికీ తిరిగి రూ.10కి కొనుగోలు చేసి రూ.20కి వెల్గటూర్, కల్లెడ, మహారాష్ట్రలోని సిరొంచ, తదితర ప్రాంతాలకు రాత్రి పూట రవాణా చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రేషన్ దుకాణాల ఎదుట లబ్ధిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి తరలిస్తున్నారంటే ఈ దందా ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వడం ప్రారంభమైనప్పటి నుంచి దందా మొదలవుతున్నది. సంబంధిత అధికారులు బియ్యం దందాపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరుతున్నారు.
సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం
-సంధ్యారాణి, తహసీల్దార్, దండేపల్లి
రేషన్‌బియ్యం అక్రమంగా తరలుతున్నట్లు ఇప్పటికైతే ఎలాం టి సమాచారం లేదు. సిబ్బంది తక్కువగా ఉండడంతో సమాచారం అందడం లేదు. గతంలో వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్నప్పుడు ఏ సమాచారమైనా చేరుతుండే. వారు లేకపోవడంతో కొంత సమాచారలోపం ఏర్పడింది. గ్రామాల్లో ఎవరైనా సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్ బియ్యం సక్రమంగా లబ్ధిదారులకు అందాలని, ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండాలని మండలంలోని డీలర్లను కూడా హెచ్చరిస్తున్నాం.