జన్నారం, ఫిబ్రవరి 19 : పొనకల్ గ్రామంలోని బాలుర హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ విద్యాలయాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు. 10, 8వ తరగతి విద్యార్థులను ఆంగ్లము, గణితంపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.
అక్కడి నుంచి నేరుగా జన్నారం గ్రామంలోని పీహెచ్సీని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కిష్టాపూర్ గ్రామ సమీపంలోని కేజీబీవీ విద్యాలయానికి చేరుకుని విద్యార్థులు ఎలా చదువుతున్నారని, వారికి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయుడు విజయకుమార్, డాక్టర్ ఉమశ్రీ, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీవాణి ఉన్నారు.