తాండూర్ : ఈనెల 24,25వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరుగనున్న రాష్ట్ర 5వ మహాసభలను(CITU Mahasabha) విజయవంతం చేయాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం తాండూర్ మండల కేంద్రంలోని ఐబీలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో పోస్టర్స్‌ను ( Posters ) విడుదల చేశారు.
ఈ మహాసభకు సీఐటీయూ అఖిలభారత కోశాధికారి సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపాలడుగు భాస్కర్ హాజరవుతారని అన్నారు. గ్రామాల పరిశుభ్రతలో ముందు వరుసలో ఉండే పంచాయతీ కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సకాలంలో వేతనాలు అందించక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు అధికారులు అధిక పని భారం మోపుతూ తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుండడం శోచనీయమని అన్నారు. మహాసభల్లో గతంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని, భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తూ తీర్మానిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అకలా అలీ, బాబా అక్బర్ అలీ, జంగపల్లి హంసరాజు, ఇప్ప రాజయ్య ,కార్మికులు పాల్గొన్నారు.