రాష్ట్ర ప్రభుత్వం రాఖీ పండుగ రోజున వీవోఏలకు కానుక అందించింది. ప్రస్తుతం రూ. 6,900ల జీతం ఉండగా, రూ. 1,100కు పెంచి.. రూ. 8వేలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,746 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ‘గౌరవ’ం దక్కిందంటూ వారంతా సంబురపడిపోతున్నారు.
మంచిర్యాల, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవోఏల గౌరవ భృతిని రూ. 6,900కు పెంచిన తెలంగాణ సర్కారు, తాజాగా మరో రూ.1100 పెంచి రూ.8000 చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 17,608 మందికి లబ్ధి చేకూరనుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,746 మంది వీవోఏలకు వేతనం పెరగనుంది. అలాగే డ్రెస్‌కోడ్ అమలుకు ఏడాదికి రూ.2 కోట్లు ఇవ్వాలని నిర్ణయించడం, జీవిత బీమాకు సంబంధించి విధివిధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించడంపై వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయాలతో తమకు భరోసా దొరికిందంటున్నారు. రాఖీ పండుగ రోజున మరచిపోలేని బహుమతి ఇచ్చి మా బతుకుల్లో వెలుగులు నింపిన పెద్దన్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటున్నారు.
తెలంగాణ వచ్చాకే వేతనం.. గౌరవం..
గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్(వీవోఏ)లు సహాయకులుగా ఉంటారు. సంఘానికి సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారాన్ని నోట్ బుక్స్‌లో నమోదు చేయడం వీరి పని. పొదుపు సంఘాల్లోని మహిళలను సంఘటితం చేస్తూ, వారిని చైతన్య పరుస్తూ నమన్వయకర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీవోఏల సేవలను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. వీరికి కొంత గౌరవ వేతనం ఉండాలనే ఉద్దేశంతో 2016 నుంచి వీవోఏలకు నెలకు రూ.3వేలు ఇస్తూ వస్తున్నారు. 2021లో రాష్ట్ర సర్కారు రూ.6,900 చేసింది. ఇప్పుడు దాన్ని రూ.8000కు పెంచారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
బేల, సెప్టెంబర్ 1 : గతంలో వేతనాలు పెంచాలని వివిధ రూపాల్లో నిరసనలు చేప ట్టినా ఎవరూ పట్టించుకోలేదు. జీతాలు పెం చుతామని ప్రకటన చేసి.. ఆ తర్వాత మాట తప్పారు. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయిన తర్వాత రూ. 3,900కు పెంచారు. మళ్లీ ఇప్పుడు మొత్తం రూ. 8000 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది గొప్ప విషయం. 5 రకాల డిమాండ్లను ఒప్పుకున్నందుకు మా సంఘం తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– మాలేకర్ ప్రవీణ్‌కుమార్, వీవోఏ రాష్ట్ర స్వతంత్ర యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
కోటపల్లి, సెప్టెంబర్ 1 : ఉమ్మడి రాష్ట్రంలో మా ఇబ్బందులను పట్టించుకున్నోళ్లు లేరు. తెలంగాణ వచ్చాక మా సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినం. మా వేతనాలు తక్కువగా ఉన్నయని చెప్పినం. రూ. 3 వేల నుంచి రూ.6,900 చేశారు. ఇప్పుడు మళ్లా రూ. 1,100 పెంచారు. రాఖీ పండుగ పూట మా జీతాలు పెంచిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – సల్పాల నాగన్న, వీవోఏ, కోటపల్లి
మరింత బాధ్యతగా పనిచేస్తా
బేల, సెప్టెంబర్ 1 : 20 ఏండ్లుగా హేటి గ్రామ వీవోఏగా పనిచేస్తున్న. వేతనం తక్కువే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పని చేస్తూ వస్తున్న. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మా బాధలను అర్థం చేసుకొని జీతాలు పెంచుతున్నడు. మరింత బాధ్యతగా పనిచేస్తా. పొదుపు సంఘాల మహిళల్లో చైతన్య తీసుకొస్తాం. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి రుణాలు సకాలంలో చెల్లించేలా చూస్తా.
– రవికుమార్, వీవోఏ, హేటి
సీఎం సార్‌కు ధన్యవాదాలు
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 1 : ఉమ్మడి రాష్ట్రంలో మా బాధలను పట్టించుకున్నోళ్లు లేరు. చాలీచాలని వేతనాలతో తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తూ వచ్చాం. తెలంగాణ వచ్చాక.. సీఎం కేసీఆర్ మా ఇబ్బందులను గుర్తించారు. ఇది వరకు జీతం పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.1100 పెంచారు. మొత్తం వేతనం రూ. 8 వేలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. సీఎం సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– శ్రీనివాస్, ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆసిఫాబాద్
కేసీఆర్‌కు రుణ పడి ఉంటాం
బేల, సెప్టెంబర్ 1 : వీవోఏలుగా పని చేస్తున్న వారందరికీ గౌరవ వేతనాలు పెంచడం ఆనందంగా ఉంది. ఇన్నాళ్లూ చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. 20 ఏండ్లుగా పని చేస్తున్న. సీఎం కేసీఆర్ మా జీతం రూ. 8 వేలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– ప్రవీణ్, సోన్ఖాస్ వీవోఏ, బేల
సీఎం నిర్ణయం హర్షించదగినది
కుభీర్, సెప్టెంబర్ 1: మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు రక్షాబంధన్ కానుకగా సీఎం కేసీఆర్ వేతనం పెంచడం హర్షించదగినది. ఇప్పుడు రూ.1,100 పెంచడంతో మొత్తం కలిపి నెలకు రూ.8 వేల గౌరవ భృతి అందనుంది. చాలా సంతోషంగా ఉంది.
– జంగం మంజుల, వీవోఏ, కుభీర్
తెలంగాణ వచ్చాకే..
ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 1 : నాపేరు గాజుల గంగాధర్. సూర్జపూర్ గ్రామపంచాయతీ వీవోఏగా విధులు నిర్వహిస్తున్న. ముఖ్యమంత్రి కేసీఆర్ మా జీతాలు పెంచి వెలుగులు నింపాడు. తక్కువ వేతనంతో చాలా రోజులు కష్టపడ్డాం. తెలంగాణ వచ్చాక మా జీతాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు వేతనం రూ. 8000 చేసినందుకు ఆనందంగా ఉంది.
ఆదిలాబాద్ రూ.387
ఆసిఫాబాద్ రూ.397
మంచిర్యాల రూ.458
నిర్మల్ రూ.504
ఇదివరకున్న వేతనం రూ.6,900
ప్రస్తుతం పెంచింది రూ.1,100
మొత్తం చేతికందే జీతం రూ.8,000