చెన్నూర్ రూరల్, జూలై 15: చెన్నూర్‌లో ‘డబ్బులు ఇస్తేనే ఎరువులు’ శీర్షికన ‘నమస్తే’లో వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా స్థాయి అధికారులు మండలంలోని పలు గ్రామాల్లోని డీసీఎమ్మెస్, హాకా, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో బెల్లంపల్లి ఏవో ప్రేమ్ కుమార్, దండేపల్లి ఏవో అంజిత్ కుమార్, తాండూర్ ఏవో కిరణ్మయి విచారణ చేపట్టారు. బిల్ బుక్స్, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. ఎరువుల విక్రయంపై డీలర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను జిల్లా స్థాయి అధికారులకు అందిస్తామని తెలిపారు.
మండలంలో డీసీఎమ్మెస్, హాకా, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేపట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక రోజు ముందే ఫోన్ చేసి హెచ్చరించడంతో తనిఖీలపై డీలర్లు అప్రమత్తమై అన్ని రసీదులు, రికార్డులు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. గతంలోనూ ఇదే విధంగా తనిఖీలు జరగగా డీలర్లకే అనుకూలంగా నివేదిక వచ్చింది.