ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 10 : విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ క్రీడల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆకాంక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం అండర్-19 బాలబాలికల జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు 14 రాష్ర్టాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. దీనికి ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతీయ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాం బిర్, ప్రధాన కార్యదర్శి ఉత్తం సింగ్ చౌదరి, సంయుక్త కార్యదర్శి జోసెఫ్, జాతీయ పరిశీలకుడు జేసీ శర్మ, అంతర్జాతీయ క్రీడాకారిణి హేమ పాల్గొని క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా కార్యక్రమ అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.
అసోసియేషన్ పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలను నిర్వహించడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. అవకాశమిస్తే జిల్లాలో ఆసియా, వరల్డ్ కప్ నిర్వహించడానికి సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గొడం నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సాయిని రవికుమార్, డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం యాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు శ్రీలత, దయాకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.