నిర్మల్ టౌన్/ ఎదులాపురం,జూలై 8: ధరణిలోని సమస్యల పరిష్కారానికి ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేశ్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, కలెక్టర్లు, ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో నిర్వహించే సదస్సుల్లో ఎమ్మెల్యేలు పాల్గొనేలా చూడాల న్నారు. సదస్సుల నిర్వహణపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ధరణిలో అంశాల వారీగా ఉన్న మ్యాడ్యుల్స్ను ప్రజలకు వివరించి, వచ్చిన దరఖాస్తులను అక్కడే పరిష్క రించాలని పేర్కొన్నారు.
ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో ఎక్కువ మంది భూసమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో పిల్లలకు అన్ని వసతులు కల్పించేలా కలెక్టర్లు పర్యవేక్షించాలని కోరారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమావేశానికి కలెక్టర్లు, జిల్లాల అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో నిర్మల్, ఆదిలాబాద్ కలెక్టర్లు ముషారఫ్ అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు రాంబాబు, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవోలు తుకారాం, లోకేశ్ కుమార్, రమేశ్ రాథోడ్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకులు వర్ణ, స్వాతి, తహసీల్దార్లు ,ధరణి సిబ్బంది ఉన్నారు.