కుంటాల, జూలై 8 : స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ వివేక్ అన్నారు. కుంటాల మండలం కల్లూర్ గ్రామంలో శుక్రవారం రుణ పంపిణీ మేళా ఏర్పాటు చేశారు. భైంసా, కుంటాల, నర్సాపూర్ మండలాలకు చెందిన పొదుపు సంఘాలకు రూ.5 కోట్ల 75 లక్షల రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పురుషులతో సమానంగా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వ్యాపారాలు చేసుకొని రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణిస్తూ పిల్లలకు మెరుగైన విద్యను నేర్పించి జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు.
టీజీబీ ద్వారా జిల్లాలో 99 శాతం సంఘాలకు పొదుపు రుణాలను అందజేశామన్నారు. వడ్డీలేని రుణాలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుంటాల మండలంలో మహిళా సంఘాలకు రూ. 3 కోట్ల 70 లక్షలు పంపిణీ చేశారు. టీజీబీ చేపడుతున్న పథకాలు, ప్రయోజనాలు, అందిస్తున్న రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఏపీడీ గోవింద్, డీపీఎం విజయలక్ష్మి, సర్పంచ్ లక్ష్మీబాయి, వైస్‌ఎంపీపీ మౌనిక, టీజీబీ మేనేజర్లు సంతోష్, రామచంద్రయ్య, శ్రీకాంత్, ఏపీఎం భోజన్న, మండలాల ఎంఎస్ అధ్యక్షులు, వీవో బాద్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.