ఆదిలాబాద్, జూలై 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధానాలను అవలంబిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టి వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న చిరువ్యాపారులను రోడ్డుపైకి తీసుకొస్తున్నది. రైతులు ఆహర్నిశలు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. చివరకు పేదలు, మధ్య తరగతి ప్రజలను కూడా కేంద్రం వదలడం లేదు. ఇటీవల కాలంలో పెరిగిన నిత్యావసర ధరల కారణంగా ఖర్చులు రెట్టింపయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. పెట్రో ధరల ప్రభావం ఇతర సరుకుల ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. రైతులు కూడా సాగులో భాగంగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ధరల కారణంగా పెట్టుబడులు కూడా పెరిగిపోయాయి.
పేదలపై భారం
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరను క్రమంగా పెంచుతూ పేదలపై భారం మోపుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 1.65 లక్షల వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ గ్యాస్ కనెక్షన్లు 1.05 లక్షలు, దీపం సిలిండర్లు 44 వేలు, ఉజ్వల కనెక్షన్లు 16 వేలు ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల వంట గ్యాస్ వినియోగించే పేదలు, మధ్య తరగతి ప్రజలు నష్టపోవాల్సి వస్తున్నది. జిల్లాలో సగటున 50 వేల సిలిండర్ల వినియోగం జరుగుతున్నది. పెరిగిన సిలిండర్ ధర కారణంగా ప్రజలకు నెలకు రూ.25 లక్షల భారం పడుతున్నది. కేంద్రం నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరల కారణంగా ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నామని, పెరిగిన సిలిండర్ ధరలతో నష్టపోవాల్సి వస్తున్నదని ప్రజలు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.