భీంపూర్, నవంబర్ 29: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి శివారు రిజర్వాయర్ సంబంధిత కట్ట నిర్మాణం పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి కూడా మళ్లీ పెద్ద పులి కనిపించగా.. ఆ సమీపంలో ఉన్న కార్మికులు ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఇదే పులి శనివారం రాత్రి కూడా కనిపించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇక్కడ, హత్తిఘాట్ పంప్‌హౌస్ కెనాళ్లలో పెద్ద పులి, మూడు పిల్లలు కనిపించాయి. నెల రోజుల వ్యవధిలో పిప్పల్‌కోటి సహా మహారాష్ట్ర సరిహద్దుకు సమీపాన ఉన్న మండల సరిహద్దు గ్రామాలు తాంసి(కే), గొల్ల గఢ్ ప్రాంతాల్లో కూడా పులి మనుగడ చాటుకుంటూనే ఉన్నాయి. తాజాగా నెల రోజుల్లోనే పులి ఐదు పశువులపై దాడి చేసి చంపేసింది. బాధిత రైతులకు పరిహారం కోసం అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞాపనలు పంపించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పిప్పల్‌కోటి, తాంసి(కే) ప్రాంతంలో అటవీశాఖ అధికారులు గులాబ్, ప్రేంసింగ్, శరత్‌రెడ్డి ఎనిమల్ ట్రాకర్స్‌తో విధులు నిర్వర్తిస్తున్నారు. సీసీ నైట్‌విజన్ కెమెరాలతో నిఘా ఉంచారు. పులి సంరక్షణ గురించి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు.