మంచిర్యాల అర్బన్, ఆగస్టు 12 : ఓ ఉద్యోగికి సంబంధించిన డీఏ నిధుల విడుదల కోసం రూ. 6 వేల లంచం డిమాండ్ చేసిన పీహెచ్సీ ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్ అడ్డంగా ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూర్ మండలం అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గడియారం శ్రీనివాస్.. కోటపల్లి పీహెచ్సీలో ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
కాగా, కోటపల్లి పీహెచ్సీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)గా విధులు నిర్వహించి గతేడాది ఉద్యోగ విరమణ పొందిన తోట వెంకటేశ్వర్లు తనకు రావాల్సిన రెండు నెలల డీఏ నిధుల కోసం ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించారు. ఇందుకు ఆయన రూ.6 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా, చేసేదేమీలేక వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మంచిర్యాల పట్టణంలోని బొమ్మరిళ్లు హోటల్లో రూ.6 వేల లంచం తీసుకుంటుండగా, అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న అధికారులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేక వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ కోరారు.