ఇచ్చోడ, జూలై 25 : ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగోన్నతులు, ఉన్నత చదువులు అవసరమైన వారికి ఓపెన్ సూల్ వరంగా మారింది. 2026-27 అడ్మిషన్లను విద్యాశాఖాధికారులు ప్రారంభించారు. తెలంగాణ సార్వత్రిక విద్యా విధానంలో చదువుకొనేందుకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధ్యయన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. చదవడం, రాయడం తెలిసి 14 యేండ్లు నిండిన వారందరికీ దూరవిద్యా విధానంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్‌కు మొత్తం 80 అధ్యయన కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 20, నిర్మల్ 23, మంచిర్యాల 19, ఆసిఫాబాద్ 18 చొప్పున అధ్యయన కేంద్రాలుండగా, వీటి పరిధిలో పలువురు పదో తరగతి, ఇంటర్ చదువుతున్నారు.
ఓపెన్ సూల్ విద్యలో పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు 2026, ఆగస్టు నాటికి 14 సంవత్సరాలు, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశాలకు గరిష్ఠ పరిమితి లేదు. ఇంటర్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుతోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీలకు చెందిన ఆభ్యాసకులు ఆయా కేటగిరీలకు సంబంధించిన పత్రాలను జత చేయాలి. ధ్రువపత్రాలు రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన వారికి ఇచ్చే వాటితో సమానం. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు అర్హత కల్పిస్తుంది.
ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ఓపెన్ సూల్లో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ భాషలు, గ్రూప్-బీ భాషేతర విషయాలు, గ్రూప్-సీలో వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. గ్రూప్-ఏ, బీల నుంచి కనీసం రెండు సబ్జెక్ట్‌ల చొప్పున మొత్తం ఐదు సబ్జెక్ట్‌లు ఎంపిక చేసుకోవాలి. ఇంటర్ గ్రూప్-ఏలో భాషలు, గ్రూప్-బీలో ఆప్షనల్స్, గ్రూప్-సీలో విద్యాకోర్సులు ఉంటాయి. గ్రూప్-ఏ నుంచి ఇంగ్లిష్‌తోపాటు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. గ్రూప్-సీలో తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. గ్రూప్-సీలో తమకు నచ్చిన వృత్తి విద్యాకోర్సును ఎంపిక చేసుకోవచ్చు. అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందిన అభ్యర్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందిస్తారు. వారికి ప్రతి ఆదివారం, రెండో శనివారం తరగతులు నిర్వహిస్తారు. సులభ పద్ధతిలో ఇచ్చిన పుస్తకాలను ఇంటి వద్ద చదువుకొని రావాలి. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తరగతులు నిర్వహిస్తారు. అభ్యాసకుల సందేహాలను అధ్యాపకులు తీరుస్తారు. కేంద్రంలో 200 వరకు అభ్యాసకులు పరీక్షలు రాసే వారుంటే.. పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేలా బోర్డు సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యాసకులు తప్పనిసరిగా 24 తరగతులకు హాజరుకావాలి.
పదో తరగతి జనరల్ కేటగిరీకి సంబంధించి పురుషుల ప్రవేశరుసుం రూ.1400, దరఖాస్తు రుసుం రూ.150తోపాటు ఆలస్య రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1650 చెల్లించాలి. అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల కేటగిరీల పురుషు రూ.1,150తోపాటు ఆలస్యం రుసుం రూ.100 కలిపి మొత్తం రూ.1250 చెల్లించాలి. ఇంటర్ జనరల్ కేటగిరీకి చెందిన వారైతే పురుషులు రూ.1500లతోపాటు రూ.300 దరఖాస్తు రుసుంతోపాటు స్పెషల్ డ్రైవ్‌లో ఆలస్య రుసుం రూ.200 కలిపి మొత్తం రూ.2000 చెల్లించాలి. ఇతర కేటగిరీలకు చెందిన వారైతే రూ.1,200కు దరఖాస్తు రుసుం రూ.300, స్పెషల్ డ్రైవ్ రుసుం రూ.200 కలిపి మొత్తం రూ.1,700 చెల్లించాలి. ఫీజులను ఆన్లైన్లో చెల్లించాలి. ప్రవేశాలను అపరాధ రుసుముతో నవంబర్ 1 నుండి పదో తేదీ వరకు చెల్లించవచ్చు.
ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందే అభ్యాసకులు తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం, వెబ్సైట్ www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్ ఫారం నమోదు చేసి డెబిట్/క్రిడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా అడ్మిషన్ ఫీజు చెల్లించి రసీదు పొందాలి. అనంతరం సంబంధిత అధ్యయన కేంద్రాలలో అడ్మిషన్ ఫారం ప్రింటౌంట్తోపాటు ధ్రువపత్రాలను అందజేశారు. అడ్మిషన్ ఫీజు ఆన్లైన్ చెల్లించిన సంక్షిప్త సమాచారం వోటీపీ సెల్ ఫోన్లకు అంతుంది. పదో తరగతి అడ్మిషన్ కోసం ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, పాస్ ఫొటో, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదో తరగతి మెమో కావాల్సి ఉంటుంది.
రెగ్యులర్‌గా చదువుకో లేని, పేద విద్యార్థులకు ఓపెన్ సూల్ మంచి అవకాశం, చదువుకోవా లని ఆసక్తి ఉన్న ప్రతి ఒకరూ ఓపెన్ సూల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. రెగ్యులర్ విద్యతో సమానంగా గుర్తింపు ఉన్నందున అభ్యాసకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ఓపెన్ సూల్ ద్వారా చదువు గొప్పవరం, అర్హులైన వారు అందుబాటులో ఉన్న అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తున్న చేసుకోవాలి.
– నాగుల అశోక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓపెన్ సూల్ కో-ఆర్డినేటర్.