బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Feb 14, 2020 , 23:17:22

అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : టజిల్లాలో అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి బి. ప్రభాకర్‌ తెలిపారు. కలప స్మగ్లింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి ఇద్దరిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశామన్నారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం, గుండాల తదితర ప్రాంతాల్లో ఏండ్లుగా అడవులను నరికివేస్తున్న ముల్తానీలకు ప్రభుత్వ శాఖల ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామని చెప్పారు. కలప రవాణాతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై కఠినంగా వ్యహరించి సస్పెండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అటవీ జంతువుల సంఖ్య పెరిగిందని పులులు, చిరుతలతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుర్గానగర్‌, కేఆర్‌కే కాలనీల్లో రెండు వేల ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అడవులను జాతీయ సంపదగా భావించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై డీఎఫ్‌వో ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

నమస్తే తెలంగాణ : జిల్లాలో అడవుల సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? 

డీఎఫ్‌వో : అడవుల సంరక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు  చేశాం. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో జిల్లాలో అడవుల నరికివేతకు గురికాకుండాప్రణాళికలు తయారు చేసి అమ లు చేస్తున్నాం. జిల్లా నుంచి ఎక్కువగా నిజామాబాద్‌కు కలప తరలడంతో పాటు ఫర్నిచర్‌ తయారీ, గృహ అవసరాలు, హో టళ్లు, దాబాల్లో కట్టెల పొయ్యి కారణంగా అడవులకు నష్టం వా టిల్లేది. కోత మిషన్లకు కలప అక్రమ రాకుండా చర్యలు  చేప ట్టాం. ఫర్నిచర్‌ తయారీదారులు అడవుల నుంచి కలప తరలించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. అటవీశాఖలో సిబ్బంది భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలో 108 మంది బీట్‌ అధికారులను నియమించింది. ఇప్పటికే 70 మంది విధుల్లో చేరారు. మరో 30 మంది నియామకం కోసం శనివారం నుంచి నాలుగు రోజుల పాటు నడక, ఇతర పరీక్షలు నిర్వహిస్తాం. ఏడాది కాలంగా అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. 

ఇచ్చోడ మండలంలోని ముల్తానీలు అడవులను నరికివేయకుండా ఎలాంటి చర్యలు  చేపట్టారు..? 

ఇచ్చోడ మండలం గుండాల, కేశవపట్నం, ఇతర ప్రాంతాల నుంచి ముల్తానీలు కొన్నేండ్లుగా అడవులను నరకడం వృత్తిగా ఎంచుకున్నారు. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే  ఇద్దరిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశాం. వారితో క్రమంగా సమావేశాలు ఏర్పాటు చేసి అడవులను నరకకుండా చర్యలు తీసుకున్నాం. అడవులతో ఉపయోగాలు, నష్టం కలిగించే వారిపై ఎలాంటి శిక్షలు ఉంటాయనే విషయాలను తెలియజేస్తున్నాం. ముల్తానీలకు ప్రత్యామ్యాయ ఉపాధి కల్పించడానికి మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో చర్యలు చేపట్టాం. పిల్లలు చదువుకునేందుకు ఇచ్చోడ మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో అవసరమైన ఏర్పాట్లు చేశాం.

అటవీశాఖ అధికారులపై కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా..?

ఆరోపణలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఐదుగురిని సస్పెండ్‌ చేశాం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అడవులను కాపాడడంలో బాధ్యతలు  మరిచిన వారిపై చర్యలు తప్పవు. అధికారులు, సిబ్బందిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. వారి విధులు, బాధ్యతలపై క్రమంగా అవగాహన కల్పిస్తున్నాం.

కలప అక్రమంగా తరలకుండా ఎలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు..? 

జిల్లా వ్యాప్తంగా తొమ్మది చెక్‌పోస్టులు ఉన్నాయి. వివిధ మార్గాల్లో ఉన్న ఈ తనిఖీ కేంద్రాల్లో అటవీశాఖ సిబ్బందితో పాటు పోలీసులు ఆయుధాలతో కాపలా ఉంటారు. వాహనాలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారు. అటవీశాఖ సిబ్బంది అడవులతో పాటు ఇతర ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండి కలప అక్రమంగా రవాణా జరుగుకుండా చూస్తారు. దీంతో పాటు జిల్లాలోని అటవీ హద్దులను గుర్తించి చుట్టూ 865 కిలోమీటర్లు పాటు కందకాలను తవ్వించి వీటిపై గచ్చికాయల చెట్ల పెంపకాన్ని చేపట్టాం. సమాచార వ్యవస్థను కూడా పటిష్టం చేశాం.

అటవీ జంతువుల రక్షణకు చేపడుతున్న చర్యలేమిటీ..? 

అడవులు పలుచబడడంతో జంతువుల సంఖ్య క్రమంగా తగ్గింది. ప్రభుత్వం అడవుల సంరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీంతో అటవీ జంతువుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో పులలతో పాటు చిరుతలు, ఇతర జంతువులు ఉన్నాయి. వేటగాళ్ల బారిన పడకుండా విద్యుత్‌శాఖ అధికారుల సహకారంతో వాటిని కాపాడుతున్నాం. సిబ్బంది కూడా అడవుల్లో  పర్యటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎండాకాలంలో అటవీ జంతువుల దప్పిక తీర్చడానికి తాగునీటి కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. 

జిల్లాలో ఎన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లు అభివృద్ధి  చేస్తున్నారు..? 

మావల హరితవనాన్ని వేయి ఎకరాల్లో అభివృద్ధి చేశాం. వీటితో పాటు దుర్గానగర్‌, కేఆర్‌కే కాలనీలోని రెండు వేల ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. ప్రతి ఒక్కరూ అడవులను జాతీయ సంపదగా భావించి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. అడవులను రక్షించడానికి అందరూ తమవంతు సహకారం అందించాలి. 


logo