శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 29, 2020 , 00:21:07

నాగోబా వైభవం

 నాగోబా వైభవం

 ఇంద్రవెల్లి : కెస్లాపూర్‌ నాగోబా జాతర భక్తజన సంద్రమైంది. మంగళవారం నాగోబాను దర్శించుకోవడానికి ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాగోబా దర్శనానికి గంటల తరబడి క్యూలో బారులు తీరారు. నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో కెస్లాపూర్‌ కిక్కిరిసి పోయింది. 


నాగోబాను దర్శించుకున్న ప్రముఖులు

కెస్లాపూర్‌ నాగోబా జాతరను పురస్కరించుకొని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, పాడిపరిశ్రామ శాఖ రాష్ట్ర చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, ఐటీడీఏ మాజీ చైర్మన్‌ కనక లక్కేరావ్‌ నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, స్థానిక సర్పంచ్‌ మెస్రం రేణుక నాగ్‌నాథ్‌, మెస్రం మనోహర్‌, కోటోడ హనుమంత్‌రావ్‌, దుర్గు, చిన్నుపటేల్‌, బాధిరావ్‌పటేల్‌, తుకోడోజీ, తిరుపతి, నాగ్‌నాథ్‌, తుకారామ్‌, ఆనంద్‌రావ్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ అంజద్‌, కనక హనుమంత్‌రావ్‌, కోవ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.


నాగోబాను దర్శించుకున్న అధికారులు

నాగోబా జాతరను పురస్కరించుకొని ఉట్నూర్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌తోపాటు తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, డీపీవో సాయిబాబా, భద్రాచలం సీఐ వినోద్‌, ఎస్సై గంగారామ్‌, వైద్యుడు శ్రీకాంత్‌తోపాటు ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.  


నేడు పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు

ఆదిలాబాద్‌ రూరల్‌ : నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలకు కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ బుధవారం లోకల్‌ హాలిడేగా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ఆమె సెలవు ప్రకటించారు. దీనికి బదులుగా మార్చిలోని రెండో శనివారం పనిదినంగా పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


తెలంగాణ ప్రభుత్వంలోనే ఆదివాసీల సంస్కృతికి గుర్తింపు

రాష్ట్రంలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల కులదేవత ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధుల మంజూరు చేశారని తెలిపారు. నాగోబా ఆలయాభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజురు చేసిందని, త్వరలోనే అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. జోడే ఘాట్‌లో రూ.25 కోట్లతో కుమ్రంభీం మ్యూజియం నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. జంగుబాయి దేవస్థానంలో నిర్వహించే ఉత్సవాలతోపాటు ఆదివాసీలు జరుపుకొనే అన్ని రకాల ఉత్సవాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నాగోబా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. logo