బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 17, 2020 , 00:31:35

ప్రచారంలో దూకుడు

 ప్రచారంలో దూకుడు
  • -డీడీసీ, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే రామన్న పర్యటన
  • - రోడ్‌షోలు, ఇంటింటా తిరుగుతూ ఓట్ల అభ్యర్థన
  • -పలు వార్డుల్లో విస్తృత ప్రచారం

ఆదిలాబాద్‌ , నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. గురువారం ఉదయం నుంచి నాయకులు, వార్డుల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు మున్సిపల్‌ పరిధిలోని విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జి.నగేశ్‌ ఇతర నాయకులు గులాబీ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. రోడ్‌షోలు, ఇంటింటా ప్రచారం చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా తమ ప్రాంతానికి, ఇండ్లకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులకు స్థానికులు గులాబీ పార్టీకి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసిన నాయకులు నామినేషన్ల చివరి రోజు అభ్యర్థులకు బీ ఫారాలు పంపిణీ చేశారు.

పలు వార్డుల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన వారికి నచ్చచెప్పి ఆయా వార్డుల్లో అభ్యర్థులను గెలిపించేలా కృషి చేయాలని సూచించారు. గురువారం నుంచి జిల్లాలోని గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్‌ మున్సిపల్‌ పరిధిలో పలు వార్డుల్లో తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలోని రోడ్‌ షోలు, ఇంటింటా ప్రచారం నిర్వహించే కారు గుర్తు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ఆరేళ్లుగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రోడ్లు, మురికికాల్వలు, ఇతర పనులను స్థానికులకు తెలియజేశారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రాంతాలకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులకు, అభ్యర్థులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయని, తమ ఉపాధి ఎంతగానో మెరుగుపడిందని ప్రజలు టీఆర్‌ఎస్‌ నాయకులకు వివరించారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రూ.1కిలో బియ్యం, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి లాంటి పథకాలతో పట్టణంలో అర్హులైన వారందిరికి వర్తించగా వారు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు అండగా నిలువనున్నారు. పలు వార్డుల్లో నాయకులు ప్రచారం నిర్వహించగా వివిధ వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సైతం తమ అనుచరులతో వీధుల్లో తిరుగుతూ గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.


logo