
Sai Dharam Tej

Sai Dharam Tej | సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నాకు సపోర్ట్ చేసిన నా గురువు మామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం అనిపించింది. కథ కూడా వినకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్ర ఖని (Samuthirakani) దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) విలేకర్లతో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మావయ్య పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan)తో నటించడానికి మొదటిరోజు కంగారు పడ్డాను. వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు. నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కనపెట్టారు. దాంతో వెంటనే సెట్ అయిపోయాను.

కథ ఓకే చేసిన సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదు. అది యాదృచ్చికంగా జరిగింది. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కుటుంబంతో సమయం గడపటాన్ని ఇష్టపడతాను.

యాక్సిడెంట్ తరువాత అప్పటికి నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు మాట ఇంత గట్టిగా వచ్చేది కాదు. దాంతో డైలాగ్‌లు చెప్పేటప్పుడు ఇబ్బందిపడ్డాను.

ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసింది. డబ్బింగ్ విషయంలో బాగా కష్టపడ్డాను. తరువాత సెట్ అయ్యింది.

మావయ్య పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎన్ని పనులున్నా ఒక్కసారి సెట్‌లోకి వచ్చారంటే సినిమాలోని ఆ పాత్రను ఎలా చేయాలనే ఆలోచిస్తారు.

బయట విషయాన్ని మర్చిపోయి ప్రస్తుతం చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది చేయగలగడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.

ఈ సినిమాలో సందేశం వుంటుంది. ఈ క్షణంలో బ్రతకటం గురించి చెబుతుంది. మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతుంది.

అదే సమయంలో కామెడీ, రొమాన్స్ ఇలా మిగతా అంశాలన్నీ కావాల్సిన మోతాదులో వుంటాయి.

ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చిన్న విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. విరూపాక్ష (Virupaksha) తర్వాతే తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇంతలో ‘బ్రో’ (Bro) షూటింగ్ ప్రారంభమైంది.

కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని మరింత దృఢంగా వస్తాను. ఇప్పటికే సంపత్ నంది (Sampath Nandi) గారి దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించాను.

కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. నన్ను యాక్సిడెంట్ సమయంలో కాపాడిన అబ్ధుల్‌కి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలి అని నేను అనుకోలేదు. ఎందుకంటే అతను నా ప్రాణాన్ని కాపాడాడు.

నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా వుంటానని చెప్పాను. ఈ మధ్య కూడా అతన్ని కలిశాను. నా టీమ్ అతనికి ఎప్పుడూ అందుబాటులోనే వుంటుంది.