రైతు దేశానికి తిండి పెడతాడు. సైనికుడు ఎల్లలు కాపాడతాడు. మనం సుభిక్షంగా ఉండాలంటే వీళ్లిద్దరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ‘జై జవాన్, జై కిసాన్’ అన్నారు పెద్దలు. వైజ్ఞానిక రంగంలో ప్రగతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని ఇటీవల ‘జై విజ్ఞాన్’ అంటున్నాం. రైతు పండించే పంటలు తెగుళ్లను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని దేశానికి ఆహార భద్రత కల్పించాలని శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృష్టిస్తున్నారు.
అలాంటి పరిశోధనలకు కేంద్రమైన ఐఐఆర్ఆర్లో మేలు రకం వరి వంగడాలు సృష్టిస్తూ, రైతులకు లాభాలు పండిస్తున్న తెలంగాణ తొలి మహిళా శాస్త్రవేత్త జ్యోతి బద్రికి రైతులు జై కొడుతున్నారు. అంతర్జాతీయ విజయాలు సాధించిన మన ఆడబిడ్డ జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే…
అగ్రికల్చర్ చదవకముందు నాకు వ్యవసాయం గురించి అస్సలు తెలియదు. నేను అర్బన్ అమ్మాయిని. పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మా నాన్న బద్రి కృష్ణకుమార్ యాదవ్ ఆర్టీసీ బస్ డ్రైవర్. నేను నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో చదివాను. చిన్నప్పటి నుంచి నేనే క్లాస్ ఫస్ట్! పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాను. గోల్డ్ మెడల్ ఇచ్చారు. నన్ను చూసి మా నాన్న చాలా గర్వంగా ఫీలయ్యేవారు. బాగా చదివించాలని కోరుకునేవారు.
అప్పట్లో ఇంటర్మీడియెట్‌కి జంట నగరాల్లో రెండు కాలేజీలు చాలా ఫేమస్! వాటిలో సీటు కోసం బాగా పోటీ ఉండేది. రెండిటిలో ఒకటైన సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్‌లో బైపీసీ సీటు వచ్చింది. ఇంటర్‌లోనూ క్లాస్ టాపర్‌గా నిలిచాను. మెడిసిన్ చదవాలని నా కోరిక. ఎంసెట్‌లో కొద్ది మార్కుల తేడాతో మెడిసిన్‌లో సీటు రాలేదు. ఆర్థికంగా భారమని లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పోకుండా బీఎస్సీ (అగ్రికల్చర్)లో చేరాను.
ఎమ్మెస్సీ (అగ్రికల్చర్) చదివేప్పుడు మా బందువులబ్బాయి కావలి రామకృష్ణ యాదవ్‌తో పెండ్లి జరిగింది. మెట్టినిల్లు కూడా హైదరాబాదే! కాబట్టి చదువుని కొనసాగించాను. మాస్టర్స్ పూర్తయ్యేలోపు బాబు పుట్టాడు. ఆ తర్వాత పాప పుట్టింది. ఇద్దరు పిల్లలు, కుటుంబ బాధ్యతల వల్ల చదువు పీజీతో ఆగిపోయింది. మాది ఉమ్మడి ఫ్యామిలీ. అప్పటికే మా మామగారు చనిపోయారు. ఇద్దరు అత్తలు, ముగ్గురు మరుదులు ఉండేవాళ్లు. నేను పెద్ద కోడలిని. అన్ని బాధ్యతలు చూసుకోవాలని అనేవాళ్లు. బంధువుల శుభకార్యాలకు, అతిథి మర్యాదలకు నేనే ముందుండాల్సి వచ్చేది. పిల్లల్ని చూసుకోవడం, వంటపని రోజూ ఉండేవే. ఈ కుటుంబ భారంతో ఓ నాలుగేళ్లు ఇంటికే అంకితమైపోయాను.
ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడా లేకుండా మా నాన్న పెంచారు. నన్ను బాగా చదివించాలని కష్టపడ్డారు. నేనూ అలాగే ఇష్టపడి చదివాను. ఎప్పుడూ చదువే లోకంగా పెరిగాను. పెండ్లి తర్వాత ఇంటికే పరిమితం కావడంతో.. అంత చదివి ఏం లాభమని ఎవరైనా అనుకుంటారేమో అనిపించేది. నాకు కూడా ఏదో వెలితిగా ఉండేది. పీహెచ్డీ చేయాలని కోరిక. ఫ్యామిలీ, పీహెచ్డీ రెండూ ముఖ్యమేనని పెళ్లికి ముందే చెప్పాను. ఆయన అంగీకరించారు. పిల్లలిద్దరూ కొంచెం పెద్దవాళ్లయ్యాక అగ్రికల్చర్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్తూ.. పీహెచ్డీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయ్యాను.
చాలాకాలం గ్యాప్ వచ్చిందని ఎక్కువగా కష్టపడ్డాను. లైబ్రరీకి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి, మధ్యాహ్నం మూడు గంటల వరకు చదివేదాన్ని. అప్పుడు పిల్లల్ని అమ్మ చూసుకునేది. నాలుగు నెలలు కష్టపడితే పీహెచ్డీ ఎంట్రన్స్-2006లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది! ఫాదర్ ఆఫ్ బాస్మతీ, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ రైస్‌గా పిలిచే పద్మశ్రీ డాక్టర్ ఇ.ఎ.సిద్ధిక్ ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రిటైర్ అయ్యారు. గౌరవ ప్రొఫెసర్‌గా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరారు. నా అదృష్టం బాగుండి పీహెచ్‌డీకి ఆయన నా గైడ్‌గా ఉన్నారు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు నా పీహెచ్డీ ఎంపికైంది.
పీహెచ్డీ చేస్తూనే అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ (ఏఆర్ఎస్) పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూ తర్వాత అఖిల భారత స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ వచ్చింది. పీహెచ్డీ థీసిస్ సమర్పించిన తర్వాత రోజు సర్వీస్‌లో చేరాను. ఏలూరు దగ్గర పెదవేగిలో ఉద్యోగం. బడికి వెళ్లే పిల్లలు, మా ఆయన బిజినెస్ ఇక్కడే ఉంది. కాబట్టి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్కి బదిలీ చేయాలని కోరాను. ఇందులో మేనేజ్మెంట్ బాధ్యతలు చూడాల్సి వచ్చింది. చాలాకాలం పనిచేశాను. ఉద్యోగంలో సంతృప్తి కలగలేదు. పీహెచ్డీ ఎంట్రన్స్‌లో టాపర్‌ని, పీహెచ్‌డీలో గోల్డ్ మెడల్ సాధించాను. పేపర్ పబ్లికేషన్స్ చాలా వచ్చాయి. ఇన్ని సాధించి.. రీసెర్చ్‌కి దూరమయ్యాననే బాధ మనసుని తొలుస్తూ ఉండేది.
నేటి సంబురం!
ఆ అవకాశం ఇప్పించమని కోరితే… నామ్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్ఆర్)కి బదిలీ చేశారు. అలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో సైంటిస్ట్‌గా అడుగుపెట్టాను. ఇక్కడ నేను చేసిన పనిని గర్వంగా చెప్పుకొంటాను. రైతుల కష్టాలు చూశాను. వాళ్ల అవసరాలు విన్నాను. దానికి తగిన పరిష్కారం కోసం జన్యు పరిశోధనలు చేసి కొత్త వంగడాలు అభివృద్ధి చేశాం. మారుతున్న వాతావరణానికి అనుకూలంగా, అధిక పోషకాలున్న ఫలసాయం, తక్కువ ఎరువుల వినిమయం లక్ష్యంగా కొత్త వంగడాల రూపకల్పన కోసం పరిశోధనలు చేశాను. రైతుకే కాకుండా ప్రజల ఆహార అవసరాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలూ చూపాను. ఎన్నో ప్రశంసలు, బహుమతులు, కొత్త కొత్త పరిశోధనలతో వరి వంగడాల అభివృద్ధి సంతోషంగా సాగిపోతున్నది!
డాక్టర్ టీ రామ్ ప్రధాన శాస్త్రవేత్తగా రిటైర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి బాధ్యతలు చేపట్టాను. షుగర్ ఫ్రెండ్లీ రైస్ నా మొదటి ప్రొడక్ట్. కొవిడ్ సమయంలో. నల్లగొండలో ఒక రైతు క్షేత్రంలో సాగు చేయించాం. ఈ వెరైటీ చాలా పాపులర్ అయింది. ఈ బియ్యంలో ైగ్లెసెమిక్ ఇండెక్స్ (51.1) తక్కువ. ఎండాకు తెగులు తట్టుకునేందుకు అనువైన మూడు జన్యువులు ఇందులో ఉన్నాయి. చౌడు నేలల్లోనూ సాగు చేయొచ్చు. సాంబ మసూరి రుచి ఉంటుంది. జింక్ అధికంగా (పాలిష్ చేసిన బియ్యంలో 24 పీపీఎం, బ్రౌన్ రైస్‌లో 27 పీపీఎం) ఉంటుంది. షుగర్ ఫ్రెండ్లీ రైస్ పేరుతో ఈ బియ్యం మార్కెట్లో ఉన్నాయి.
-తమ్మడి మాసయ్య