నేను ఒక బ్యాంక్ కోసం చానెల్ పార్ట్నర్గా పని చేస్తున్నాను. అక్కడ ఓ ఉద్యోగి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులు జరిపాడు.
ఇదే విషయం నేను అధికారులకు ఫిర్యాదు చేశాను. కానీ, వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవన్న కారణంగా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారు. నాకు న్యాయం ఎలా జరుగుతుంది? లైంగిక వేధింపుల ఆధారాలను ఎక్కడి నుంచి తీసుకురావాలి?
ఓ సోదరి
జ : మిమ్మల్ని వేధించిన వ్యక్తి, మీరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు కాకపోతే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం మీకు వర్తించదు. కానీ, ఐపీసీ సెక్షన్ 354 కింద లైంగిక వేధింపులపై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఆధారాలు లేకపోయినా, విచారణ సమయంలో దీనిపై చర్చ జరుగుతుంది. అతడి స్వభావం నలుగురికీ తెలుస్తుంది. బ్యాంక్ యాజమాన్యం సహాయ నిరాకరణను నమోదు చేయాలంటే ఒకటే మార్గం. ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదును బ్యాంక్ అధికారులకు పంపండి. మీ ఫిర్యాదును వాళ్లు నిరాకరించారన్న విషయం ఈ విధంగా అయినా రికార్డు అవుతుంది. మీరు పంపే మెయిల్లో వేధింపులకు సంబంధించి పూర్తి వివరాలు ఉండాలి. అదీ కచ్చితంగా ఉండాలి. దాంతోపాటు విచారణ జరుగుతున్నంత కాలం మీరు ఒకే మాటపై నిలబడాలి.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in