మేడమ్ నమస్తే. మా అమ్మాయి వయసు పదహారు. ఇంటర్మీడియెట్ చదువుతున్నది. తనకెప్పుడూ నెలసరి సరిగా రాదు. రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నది. పాప ఎత్తుకు తగిన బరువు ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా లేవు. ఒకవేళ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఏమో అన్న అనుమానంతో డాక్టరుకు చూపించాం. అలాంటిదేమీ లేదన్నారు. మరెందుకిలా ఆలస్యం అవుతున్నదో అర్థం కావడం లేదు.
-ఓ సోదరి
ఈమధ్య కౌమారంలోని అమ్మాయిలలో ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నిజానికి ఇవన్నీ జీవనశైలి కారణంగా ఉత్పన్నం అవుతున్న సమస్యలు. మీ అమ్మాయి వయసు పిల్లలకు పాఠశాలలు, కాలేజీల్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. జీవిత లక్ష్యాలతో ముడిపడిన ఆలోచనలు వెంటాడుతుంటాయి.
విద్యార్థుల మధ్య పోటీ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే వాళ్లు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. బయటికి తెలియకపోయినా, ఇలాంటి సమస్యలు చాలామంది పిల్లల్లో కనిపిస్తున్నాయి. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది అండాల విడుదల సక్రమంగా జరగకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల నెలసరి ఆలస్యంగా వస్తుంది. కాబట్టి, మీ అమ్మాయితో ప్రేమగా మాట్లాడండి. నచ్చింది చదువుకోమని చెప్పండి. మార్కుల ఒత్తిడి పెట్టకండి. తను ప్రశాంతంగా ఉంటే ఈ ఇబ్బంది దానంతట అదే తగ్గిపోతుంది. ఇంటర్ పిల్లలు రోజూ పదీపన్నెండు గంటలపాటు కూర్చునే ఉంటారు. ఫలితంగా శరీరానికి సరైన కసరత్తు లభించదు. రోజూ కొంతసేపు వ్యాయామం చేయమని కూడా చెప్పండి.
-డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్