ప్రతి గృహిణిని వేధించే సమస్య ‘రేపు ఏం వండాలి?’. ఈ పూటకు ఎలాగో గడిచిపోయినా.. రేపటి సంగతేమిటి? అనే ప్రశ్న కలవరపెడుతూనే ఉంటుంది. ‘సార్టీజీ’ యాప్ వచ్చేసింది. ఇక ఆ ఇబ్బందే ఉండదు. ఇదో రుచుల ప్రపంచం. ఏం తినాలో చెబుతుంది. ఎలా వండాలో నేర్పుతుంది. ఏఏ దినుసులు కావాలో వివరిస్తుంది. వాటిని మీ ఇంటికే డెలివరీ చేయనున్నది కూడా. ‘సార్టీజీ’ వ్యవస్థాపకురాలు సుర్బీ గుహా తన స్టార్టప్ కహానీ వినిపిస్తున్నారు..
పొద్దున టిఫిన్. ఏమైతే బావుంటుంది? కాసేపట్లోనే భోజనం. ఏ కూరలు వండాలి? సాయంత్రం స్నాక్స్. కొత్తగా ఏం చేయాలి? అంతలోనే, డిన్నర్ గుర్తు కొస్తుంది. ఇలా లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు గృహిణి ఆలోచనలన్నీ వంటల గురించే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నది సుర్బీ గుహా. ‘సార్టీజీ’ అనే స్టార్టప్ ద్వారా ఓ ‘డిజిటల్ కిచెన్’ను సృష్టించిందామె. నాగపూర్‌కు చెందిన సుర్బీ హైదరాబాద్‌లో బిజినెస్ స్ట్రాటజీ కన్సల్టెంట్‌గా పనిచేసింది. ఉద్యోగం బాగానే ఉన్నా రోజూ వంట చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది. దాన్నే బిజినెస్ ఐడియాగా మలుచుకుంది.
యాప్‌తో ఆరోగ్యం
సార్టీజీ యాప్‌లో ఇంట్లోనే సులభంగా వండుకో దగిన రెసిపీ షార్ట్ వీడియోలు ఉంటాయి. వీగన్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ లిస్ట్ కూడా లభిస్తుంది. విదేశీ వంటకాలు, ప్రత్యేకమైన డైట్ ప్లాన్లు, కొత్త రెస్టారెంట్లు, రుచికరమైన స్ట్రీట్‌ఫుడ్స్ గురించీ తెలుసుకోవచ్చు. అనుభవం, ఆసక్తి ఉంటే మనమే ఓ సరికొత్త వంటను తయారు చేసి, వీడియోను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైట్ ప్లాన్ గురించి. వారానికి సరిపడా టిఫిన్లు, మధ్యాహ్న భోజనాలు, డిన్నర్ ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయి. ఏయే ఆహార పదార్థాల్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయి, ఏ డైట్ ఫాలో అయితే ఆరోగ్యానికి మేలు? అనే విషయాలనూ సవివరంగా యాప్‌లో ఇచ్చారు సుర్బీ గుహా. ఇప్పటికే యాప్‌ను లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు. రోజుకో కొత్త వంటను అందిస్తూ.. అనతికాలంలోనే ఎక్కువమంది కస్టమర్లను చేరుకున్నందుకు గూగుల్ ప్లే.. ఎవ్రీడే ఎసెన్షియల్ కేటగిరీ కింద ‘ఇండియాలోనే ఉత్తమ యాప్’గా అవార్డు అందించింది. గత జూలైలో గూగుల్ ప్లే నుంచి రైజింగ్ స్టార్స్ ఆఫ్ ఇండియా అవార్డునూ స్వీకరించింది సార్టీజీ యాప్.
మహా కిచెన్
‘సార్టీజీ’ రుచుల ప్రపంచం. ఇక్కడ నిష్ణాతులైన షెఫ్‌లు ఉంటారు. ప్రత్యేకించి హోమ్ కుక్ కమ్యూనిటీ ఉంది. హోమ్‌షెఫ్‌లు, ఫుడ్ బ్లాగర్లు అప్లోడ్ చేసే వీడియోలు వేలలో ఉంటాయి. ఈ యాప్ ద్వారా నచ్చిన షెఫ్‌ను ఫాలో అవుతూ ఆయా వంటలను వండుకోవచ్చు. ఆసక్తి ఉంటే సొంతంగా వీడియోలు తయారు చేయవచ్చు. నచ్చిన ఫుడ్ వీడియోలు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడే కిరాణా సామగ్రి, చిరుతిండ్లు షాపింగ్ చేయవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో లభిస్తున్నది. ‘యాప్‌లో చూసి వంట చేసుకోవడం సరే. అసలు వంటేరాని వారి పరిస్థితి ఏమిటి? అనే సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్, బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్లతో ఒప్పందం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. దీంతో తక్కువ ధరకే రుచికరమైన భోజనం ఇంటికి వస్తుంది’ అంటున్నది సుర్బీ గుహా. వంట ఎవరికీ తంటా కాకూడదన్నదే ఆమె ఆలోచన. ఆసక్తి ఉంటే మీరు కూడా www. sortizy.com యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వీహబ్ సాయం మర్చిపోలేనిది
మొదట్లో ఒక్కదాన్నే చాలా కష్టపడ్డాను. చాలా చోట్లకు వెళ్లాను. ఈ ప్రయాణంలో నా స్నేహితురాలి ద్వారా వీహబ్ గురించి తెలిసింది. ఆ తర్వాత నేరుగా వెళ్లి అక్కడి కార్యకలాపాలు చూశాను. అధికారులు ఎంతో సహకరించారు. ఒక మెంటర్‌ను కేటాయించి నెట్వర్క్, పీఆర్, గైడెన్స్, ఫండింగ్ వరకు అన్ని విధాలా అండగా నిలిచారు. వంట దినుసులు, సరుకుల డెలివరీ కూడా సార్టీజీ యాప్ నుంచే చేసేందుకు కిరాణా షాపుల యజమానులతో మాట్లాడుతున్నాం.
సుర్బీ గుహా, సార్టీజీ వ్యవస్థాపకురాలు
-రవికుమార్ తోటపల్లి