ఇంట గెలిచి రచ్చ నిలిచిన భామ ప్రియాంకా చోప్రా జోనస్. తన అందచందాలతో, అభినయంతో బాలీవుడ్లో వెలిగిన ఆమె ఆంత్రప్రెన్యూర్ అవతారం ఎత్తింది. కేశ సంరక్షణ కోసం ప్రత్యేకమైన బ్రాండ్లు తీసుకొచ్చి అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నది. ‘అనోమలి’ పేరుతో నూనె, షాంపూ, కండిషనర్, హెయిర్ మాస్క్ తదితర ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. బ్యూటీ కేర్ గురించి గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న తనకన్నా ఇంకెవరూ బాగా చెప్పలేరు అంటున్నది ప్రియాంక.
ఒక బ్యూటీ బ్రాండ్ తీసుకురావాలన్న నా కల ఇన్నాళ్ల కు నెరవేరింది. కేశాల సంరక్షణ కోసం ‘అనోమలి’ ఉత్పత్తులు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సౌందర్య సాధనలో కేశ సంరక్షణ చాలా ముఖ్యం. నా చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ రెగ్యులర్‌గా నా తలకు నూనె రాస్తుండేవారు. తరచూ ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో తల స్నానం చేయించేవారు. ‘అనోమలి’ కూడా వెంట్రుకలకు అలాంటి రక్షణే కల్పిస్తుంది.
దాదాపు 22 ఏండ్లుగా నేను గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను. నేను వాడని బ్యూటీ ప్రొడక్ట్ లేదు. ప్రపంచంలో ‘ద బెస్ట్’ అని పేరొందిన ఉత్పత్తులన్నీ వాడాను. అయితే వాటి ధరలు నింగిలో ఉంటాయి. సామాన్యులు వినియోగించలేరు. స్కిన్ కేర్ ఉత్పత్తుల ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ధరలు అధికంగా ఉంటున్నాయి. అందుకే, అందుబాటు ధరలోనే మంచి ఉత్పత్తులను తీసుకురావాలి అనుకున్నాను. ఎలాంటి రసాయనాలు లేకుండా మా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం.
నా జుట్టంటే నాకు ప్రాణం. చర్మ సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తానో, జుట్టు గురించి అంతగా ఆలోచిస్తాను. నాకు ఇప్పటికీ గుర్తు.. నా జుట్టు పొడిబారితే మా అమ్మమ్మ అస్సలు వదిలిపెట్టేది కాదు. బలవంతంగా కూర్చోబెట్టి కొబ్బరినూనె, బాదాం నూనె దట్టంగా పట్టించి మర్దనా చేసేది. ఇప్పటికీ వారానికి ఒకసారైనా ఆయిల్ అప్లయ్ చేస్తాను. కుదుళ్లు బలంగా ఉంటేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పైపైన కాకుండా మాడుకు పట్టేలా నూనె అప్లయ్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడైతే నేను నా బ్రాండ్ ‘అనోమలి’ హెయిర్ ఆయిల్‌నే ఉపయోగిస్తున్నా. షాంపూ, కండిషనర్ కూడా మా ప్రొడక్ట్స్‌నే వాడుతున్నా!
వారానికి ఒకటి రెండుసార్లు హెయిర్ మాస్క్ అప్లయ్ చేస్తాను. దాని వల్ల కేశాలు ఆరోగ్యంగా తయారవుతాయి. కేశ సంరక్షణ ఒక్కరోజుతో ముగిసేది కాదు. నిరంతరం దృష్టి సారించాల్సిందే! రానున్న రోజుల్లో స్కిన్ కేర్ ఉత్పత్తులు తీసుకువచ్చే ఆలోచనలు కూడా ఉన్నాయి.
సౌందర్య సాధన ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రధానం. వర్కవుట్లు చేయడం అంటే నాకు ఇష్టం. 35 ఏండ్ల వయసు దాటిన తర్వాత జీవక్రియల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాటికి తగ్గట్టుగా శారీరక బలాన్ని సంతరించుకోవాలి. అందుకోసం సరైన ఆహార నియమాలు పాటించడంతోపాటు యోగ, వ్యాయామం చేయడం తప్పనిసరి. ఈ విషయంలో నేను చాలా కచ్చితంగా ఉంటాను.
చేతినిండా పనితో చాలా బిజీగా ఉన్నా. వివిధ బ్రాండ్లకు అంబాసిడర్‌గా ప్రకటనలు చేస్తున్నా. నటిగా బిజీగా ఉన్నా. ‘సిటడెల్’ సిరీస్ త్వరలో అమెజాన్‌లో విడుదల కాబోతున్నది. ‘ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ’ ఆంగ్ల చిత్రం, బాలీవుడ్ సినిమా ‘జీ లే జరా’ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.