మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉందా? ఆ ఐడియాతో వ్యాపారంలో రాణించాలని అనుకుంటున్నారా? అయితే బాలీవుడ్ క్వీన్ అలియా భట్‌ను సంప్రదించండి. అది వ్యాపార ఆలోచన అయినా.. సినిమా కథ అయినా.. మీ ఐడియాలో నిజాయతీ ఉంటే తప్పక మద్దతు ఇస్తుంది. వ్యాపారం గురించి తన అభిప్రాయాలు వింటే.. కొంపదీసి ఏ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో అయినా చదువుకొని వచ్చిందా అనే అనుమానం కలుగుతుంది.
‘నీ దగ్గర ఏదైనా వస్తువును కొన్న ప్రతి కస్టమర్ మరో వ్యక్తికి తన షాపింగ్ అనుభవం గురించి చెప్పగలిగితే చాలు. నీ స్టార్టప్‌కు తిరుగులేదు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. ప్రతి పెట్టుబడికి ముందూ నేను ఆ సంస్థ ఫిలాసఫీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా. తక్షణ లాభాల కోసం వెంపర్లాడటం ఇష్టం ఉండదు. దీర్ఘకాలిక వ్యూహంతోనే అడుగులేస్తాను. నీ ఆలోచన కావచ్చు, వ్యాపారం కావచ్చు.. కాల పరీక్షను తట్టుకుని నిలబడాలి. అప్పుడే, బిలియన్ డాలర్ కంపెనీ అవుతుంది’అని వివరిస్తుంది అలియా. కాబట్టే, తను పట్టిందల్లా బంగారమైంది. కాదు కాదు, బంగారాన్ని పట్టడమే తన అలవాటు.