ఐశ్వర్యవంతుల ఇంట పుట్టానన్న గర్వం ఒకెత్తు. ఆరాధించిన వాణ్ని చేపట్టానన్న ఆనందం మరోఎత్తు. తన పెనిమిటి అష్టభార్యలలో ఇష్టసఖిని తానేనని మురిసిపోయే అబల! తన ఆనతి మీరలేనంతగా మురారిని మాయచేసిన సబల! అందం, ఆత్మాభిమానం కలగలిసిన రమారమణుని ప్రణయసఖీ తానే. కన్నెర్ర చేస్తే కదనరంగంలో ప్రళయ మూర్తీ తానే. ఒక్కమాటలో చెప్పాలంటే యుగాల కిందటే స్త్రీ ఔన్నత్యాన్ని చాటిన లోకోత్తర భామిని. ఎక్కడ బెట్టు చేయాలో, ఎక్కడ పట్టువిడుపులు ప్రదర్శించాలో ఆమెకు బాగా తెలుసు. నరకాసురుణ్ని సంహరించి లోకానికి దీపావళి వెలుగులు పంచిన ధీరవనిత సత్యభామ. ఈ దివ్వెల వెలుగుల్లో ఆ వీరనారి అందించిన స్ఫూర్తిని స్మరించుకుందాం!
సహనానికి మారుపేరు స్త్రీ. భూదేవికి ఉన్నంత ఓర్పు ఆమెకు ఉంటుందని అభివర్ణిస్తారు. సాక్షాత్తూ భూదేవి అంశతో జన్మించింది సత్యభామ. సత్రాజిత్తు గారాలపట్టిగా అల్లారుముద్దుగా పెరిగింది. మాయామానుష విగ్రహుడైన కృష్ణుడిని ఆరాధించింది. అతనే తనకు భర్త కావాలనుకుంది. సూర్యుడి వరప్రసాదంగా సత్రాజిత్తు శమంతకమణి పొందాడు. రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్నిచ్చే ఆ మణిని కృష్ణుడు అపహరించాడన్న వదంతు వ్యాపించింది. శ్రీకృష్ణుడు దక్షతతో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని నిరూపించుకున్నాడు. శమంతకమణిని చేజిక్కించుకొని సత్రాజిత్తుకు అందజేసి.. అందాలభామ సత్య చేయి అందుకున్నాడు. అప్పటివరకూ నల్లనివాడు, పద్మనయనంబులవాడు, అందరివాడు అని కీర్తిగడించిన కృష్ణుడు ఆ తర్వాత సత్యాపతి అనిపించుకున్నాడు. ఈ అరాళకుంతల అంతలా ఏం మాయ చేసిందో గోపాలుడికే ఎరుక!
అష్టభార్యల్లో అందగత్తె సత్యభామ. పైగా కలవారి ఇంటి నుంచి వచ్చింది. ఇంకేం, అందుకు తగ్గట్టుగానే ఉండేది ఆమె వ్యవహారం. కోపాలు, తాపాలు మామూలే! ప్రణయ కలహాలు షరామామూలే!! ఈ మదిరాక్షిని మథురాధిపతి ఎంతలా నెత్తికి ఎక్కించుకున్నాడంటే.. పరాకుగానో, చిరాకుగానో ఆమె పాదం తాకించినా.. ‘పదపల్లవం నొచ్చుకుందేమోన’ని వగచాడు. ‘ఇకనైనా అలక మాను!’ అని బతిమాలుకున్నాడు. దేవేరి కోరిక తీర్చడానికి ఏకంగా దేవేంద్రుడిపైనే దండెత్తాడు. స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తెచ్చి సత్యభామ పెరట్లో నాటాడు. ముల్లోకాల పాలకుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆమె దగ్గరికి వచ్చేసరికి పాలితుడు మాత్రమే!! భర్తను ఎలా కొంగున ముడివేసుకోవాలో.. ఈ ఇతివృత్తం చెబుతుంది. అవతారమూర్తులు కాబట్టి, వాళ్లు ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు కూడా అదే బాటలో గట్టిగా బెట్టు చేస్తామంటే అసలుకే ఎసరు రావొచ్చు. ఆలుమగలు ఇద్దరూ ఎవరో ఒకరే నెగ్గాలని భావించొద్దు. ఒకరి మనసును ఇంకొకరు గెలుచుకునే ప్రయత్నంలో ఎవరికి వారు ఎంత తగ్గినా ఇద్దరికీ ఇంపే!
ప్రేమ కోసమే..
గోకులంలో రాధ ఆరాధనకు కట్టుబడిన శ్రీ కృష్ణుడు తర్వాత పట్టుబడింది రుక్మిణీదేవి భక్తికే! అయితే, ఎంత కొంగున ముడేసుకున్నా… రుక్మిణి భక్తి ముందు తన శక్తి యుక్తులు చాలడం లేదనుకుంది సత్యభామ. ఈ సందర్భంగా సాధారణ స్త్రీలా సవతిపోరును సహించలేకపోయింది. గోవిందుడు తనవాడు మాత్రమే కావాలనుకుంది. అందుకు ‘పుణ్యక వ్రతం’ మార్గమని భావించింది. చివరగా భర్తను చెట్టుకు కట్టి, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, భర్త బరువుకు సమానమైన బంగారం, ఆభరణాలు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి తిరిగి భర్తను పొందడంతో వ్రతం పూర్తి అవుతుంది. నెలరోజులపాటు నియమనిష్ఠలతో వ్రతాన్ని ఆచరించింది సత్యభామ. చివరి ఘట్టం రానేవచ్చింది. కృష్ణుడిని నారద మహర్షికి దానం ఇచ్చింది. తిరిగి కృష్ణుడిని త్రాసులో ఒకవైపు ఉంచి, మరోవైపు నిలువు దోపిడి బంగారు ఆభరణాలు ఉంచింది. గోవర్ధనగిరిని చిటికెన వేలితో ఎత్తిన గోపాలుణ్ని కొలవడం ఎవరికి సాధ్యం? సత్యభామ తన అంతఃపురంలో ఉన్న బంగారమంతా తెచ్చి ఉంచినా త్రాసు దండంలో కదలిక కనిపించలేదు. చివరికి ‘గోవిందుడు అందరివాడేలే’ అని ఒప్పుకొన్న సత్యభామ రుక్మిణీదేవి సాయం కోరింది. ఆమె భక్తితో సమర్పించిన ఒక్క తులసీదళానికి తేలిపోయి తూగాడు స్వామి. ఈ ఘట్టంలో భర్త తనకు మాత్రమే విధేయుడిగా ఉండాలన్న బేలతనం సత్య భామలో కనిపిస్తుంది. అయితే, తన తప్పును తెలుసుకొని దిద్దుకున్న తీరు ఆచరణీయం.
కదన కాళి
భూదేవి, వరాహమూర్తి సంతానం నరకా సురుడు. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకొని విశృంఖలంగా విజృంభించాడు. దేవతలు కృష్ణుడితో తమ బాధలు చెప్పుకొన్నారు. కృష్ణుడు కదిలాడు. ఒక రకంగా చెప్పాలంటే నరకాసురుడు భూదేవి అంశగా జన్మించిన సత్యభామ కొడుకు. దారి తప్పిన బిడ్డను ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. అందుకే కాబోలు, యుద్ధం చూస్తానంటూ సత్యభామా కృష్ణుడి వెంట నడిచింది. భీకర యుద్ధం మొదలైంది. తానూ యుద్ధం చేస్తానంటూ కృష్ణుడి చేతిలోని ధనుర్బాణాలను అందుకుంది.
వీరశృంగార భయరౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయు టెల్ల
నెరుఁగ రాకుండ నని సేసె నిందువదన
‘వీరం, శృంగారం, భయం, రౌద్రం, విస్మయం అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా కనిపించిందట సత్యభామ. ఆమె బాణం తొడగడం, నారి సారించడం, బాణం ప్రయోగించడం గుర్తించలేనంత వేగంగా యుద్ధం చేసింది’ అని భాగవతంలో సత్యభామ యుద్ధ కౌశలాన్ని వర్ణించాడు మహాకవి పోతన. స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిన పౌరాణిక ఘట్టం ఇది. శారీరకంగా, మానసికంగా మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరని భావితరాలకు బోధించింది సత్యభామ. ఈ రోజు రణరంగంలో విన్యాసాలు చేస్తున్న వీరనారులకు తొలి ఆదర్శం ఆమే! మనిషి శక్తి యుక్తులకు లింగభేదం లేదని చాటిచెప్పిన ఈ పురాణ మహిళ తరతరాలకు తరగని, చెరగని స్ఫూర్తి. ఆమెను ఆదర్శంగా తీసుకుందాం. ఆత్మాభిమానం అనే చమురులో, ఆనందమనే వత్తి వేసి, అందమైన దీపాలను వెలిగిద్దాం.