జిందగీ.. తెలంగాణ ఆడబిడ్డల.. ఆత్మీయ నేస్తం. పుట్టింటి చుట్టం. ప్రతీ కథనం ఆమె హృదయావిష్కరణే. కష్టాల చీకట్లో.. హరికేన్ లాంతరు. చిక్కుల చినుకుల్లో.. చటుక్కున విచ్చుకునే ఛత్రి. ఒంటరి యాత్రలో.. వెన్నంటే సహచరి. కాబట్టే, నిలువుటద్దంలోనే కాదు.. నిండైన ‘జిందగీ’ పేజీలోనూ తనను తాను చూసుకుంటుంది తెలంగాణ మహిళ. కాటుక దిద్దుకున్నంత సహజంగా.. బొట్టు పెట్టుకున్నంత ఇష్టంగా.. జడేసుకున్నంత మమకారంగా.. ‘జిందగీ’నీ చదువుతుంది.
‘నువ్వు.. సగం నిజానివి.. సగం స్వప్నానివి’ అంటారు ఠాగూర్ మహిళలోని మార్మికత గురించి. ఆ రెండు సగాల మధ్య.. అక్షరాల వారధి.. జిందగీ. ఆమె ఎవరెస్టు ఎక్కితే.. తాను ఏనుగెక్కినంత సంబురపడుతుంది. ఆమె అంతరిక్షానికి వెళ్తే.. అంబరం అందినంత ఆనందిస్తుంది. సివిల్స్‌లో గెలిచి.. ఏ ఐపీఎస్గానో నిలిస్తే.. తానే నాలుగో సింహమైనంత సంతోషం. కొత్త ఆలోచనతో ఏ స్టార్టప్ వచ్చినా.. ‘కీపిటప్’ అని ప్రోత్సహిస్తుంది. సామాజిక సమస్యల పరిష్కారానికి.. ఏ ఎన్జీవో రంగంలోకి దిగినా.. సహృదయంతో స్వాగతిస్తుంది. దళిత మహిళ వ్యవసాయ విజయాన్ని, చేనేత చెల్లెమ్మ చేతి మహత్యాన్ని, సర్పంచ్ మేడమ్ అభివృద్ధి నినాదాన్ని, అంగన్వాడీ అక్క సేవా గుణాన్ని.. కథనాలతో కండ్లకు కడుతుంది. శీర్షికల సింహాసనం వేసి, అక్షరాల అత్తర్లు చల్లి, కథనాల రథం మీద రాష్ట్రమంతా ఊరేగిస్తుంది. ఒక్క ఏడాది కాలంలో ఎంత స్త్రీశక్తి? ఎంత కీర్తి? ఎంత స్ఫూర్తి?..
విజయోస్తు మహిళా..
ప్రతి తల్లీ ఓ సృష్టికర్తే. ప్రతి మహిళా శక్తి స్వరూపిణే. చదువులో సరస్వతి, ధైర్యంలో దుర్గ, పొదుపు-మదుపులో మహాలక్ష్మి, లలితకళలలో లలితా త్రిపురసుందరి.. స్త్రీలోని దైవత్వాన్ని ఆవిష్కరించే కథనం.
అవసరం ఆవిష్కరణలకు అమ్మలాంటిదని అంటారు. నిజానికి, అమ్మతనంలో ఆవిష్కరణ ఓ భాగం. ఆ ప్రకారంగా.. సృష్టిలో తొలి ఆవిష్కర్త అమ్మే. కాబట్టే, తెలంగాణ సర్కారు కలల పంట.. వీహబ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు చిరునామాగా మారింది. అంకురాలకు అండగా నిలుస్తున్నది. ఆ ప్రస్థానంపై ప్రత్యేక కథనమిది.
హరిప్రియారెడ్డి ‘బ్లూబోట్ రోబోటిక్స్’ సేద్యానికి ఓ వరం. హానికర రసాయనాల నుంచి బక్క రైతుకు శాశ్వత విముక్తి. విత్తనాలు చల్లడం మొదలుకొని క్రిమిసంహారకాల పిచికారీ వరకు.. సకల సేవలూ అందించే డ్రోన్లను అందుబాటులోకి తెచ్చారు హరిప్రియ.
తల్లీ నిన్ను దలంచి..
పిల్లల భవిష్యత్తు కోసం అమ్మ చేయని త్యాగమంటూ లేదు. నాగలి పడుతుంది. పొలం దున్నుతుంది. పుట్టెడు వడ్లు పండిస్తుంది. అవసరమైతే.. అటకెక్కిన పుస్తకాల దుమ్ముదులిపి పరీక్షలురాసి.. సర్కారీ కొలువూ సంపాదిస్తుంది. స్ఫూర్తినింపే ఇలాంటి కథనాలెన్నో.
వాట్సాప్.. హ్యాండ్సప్!
ఒక్క వాట్సాప్ మెసేజ్ చాలు. పోకిరీల ఆటకట్టిస్తారు. అత్తింటి వేధింపులు అడ్డుకుంటారు. వరకట్న హింసకు చరమగీతం పాడతారు. తెలంగాణ మహిళా కమిషన్ నేతృత్వంలో చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం గురించి..
నేడే చూడండి
ప్రతి శుక్రవారం చాలా సినిమాలు విడుదల అవుతాయి. వచ్చినంత వేగంగానే కనుమరుగైపోతాయి. కొన్ని మాత్రం.. చాలాకాలం గుర్తుండిపోతాయి. కారణం, ఆ పాత్రలలో మనల్ని మనం చూసుకుంటాం. ఆ ఇతివృత్తాన్ని మన జీవితంలోంచే తీసుకున్నారా అనిపిస్తుంది. అంజనీ మీనన్ దర్శకత్వంలోని ‘వండర్ ఉమెన్’ అలాంటి చిత్రమే.
భారత రాజ్యాంగం మహిళలను మహోన్నత స్థానంలో నిలబెట్టింది. ప్రభుత్వాలు సైతం సందర్భోచితంగా అనేక చట్టాలు చేశాయి. అవన్నీ ఆమెకు రక్షణ కవచాలై నిలుస్తాయి. సంక్షోభ సమయంలో గెలిపిస్తాయి. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక కథనంగా..
తెలంగాణ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం. ఇద్దరు ట్రాన్స్జెండర్లు తొలి వైద్యులుగా.. తొలి ప్రభుత్వ వైద్యులుగా రికార్డుకెక్కారు. నాడి పట్టుకుని రోగాన్ని పట్టేసుకుని.. మందులు ఇస్తున్నారు. స్వస్థత ప్రసాదిస్తున్నారు.
అన్నం పెడితే కడుపే నిండుతుంది. కానీ అక్షరం దిద్దిస్తే బతుకు నిండుతుంది. జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆ ఆశయంతోనే హైదరాబాద్‌లో ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’ పేరుతో ఓ ఎన్జీవోను నడుపుతున్నారు చావా అరుణ. ఆమె సేవా గుణానికి అభినందనలు.
‘ఆ పిల్లలను ఎవరితోనూ పోల్చకండి. వాళ్లు ఆణిముత్యాలు. ఇష్టమైన రంగంలో సాన బెట్టండి. నిజంగా బంగారాలే. చిన్నచూపు చూడకండి’ అంటూ ఎదిగీ ఎదగని మనసులకు తన గుండెల్లో ప్రత్యేక స్థానమిచ్చారు ‘మార్గిక’ వ్యవస్థాపకురాలు నీనా రావు.
అతను, ఆమె ప్లస్ బాబు లేదా పాప.. అంతే! కుటుంబం మరీ చిన్నదైపోయింది. కన్నవాళ్లు కూడా వేసవి చుట్టాలైపోయారు. ఈ సంక్షోభ సమయంలో పిల్లల పెంపకం పెనుసవాలుగా మారింది. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు షిరీన్, సుమేధ అనే ఇద్దరు మహిళల రూపకల్పన.. ‘కిండర్పాస్’ మొబైల్ అప్లికేషన్. ఆ చొరవకు కుడోస్!
కష్టాలు వచ్చాయి. పోయాయి. సమస్యలు ఎదురొచ్చాయి. తొలగిపోయాయి. అంతిమంగా నాలుగు చక్రాల బండి మిగిలింది. ఆ బండి స్టీరింగ్ చేతికొచ్చింది. ఎత్తు పల్లాలు దాటుకుంటూ, ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ కస్టమర్లను గమ్యానికి చేరుస్తూనే ఉన్నారు.. దండు లక్ష్మి.
నిలబడటానికి ఆమె వెన్నెముక సహకరించకపోవచ్చు. కానీ, ప్రపంచాన్ని చూపడానికి ఇంటర్నెట్ సిద్ధంగా ఉంది. బుర్రలో కొత్త ఆలోచనలూ ఉన్నాయి. చాలు, ఆ మాత్రం సాధన సంపత్తి సరిపోతుంది. కాబట్టే, చక్రాల కుర్చీకి పరిమితమైన మీనాక్షి.. గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
మహిళలు కండోమ్స్ గురించి మాట్లాడటమే నేరమైన సమాజంలో, పురుషులు సైతం నేరుగా వెళ్లి కొనలేని వాతావరణంలో.. కోమల్ బల్ద్వా ఏకంగా కండోమ్ తయారీ రంగంలో అడుగుపెట్టారు. లైంగిక ఆరోగ్యానికి సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేశారు.
మన ముఖ్యమంత్రి స్త్రీ పక్షపాతి. ‘కల్యాణ లక్ష్మి’తో కొత్త పెండ్లి కూతురి కళ్లలో కోటి వెలుగులు నింపారు. మిషన్ భగీరథతో మైళ్లకు మైళ్లు నీళ్ల బిందెలు మోయాల్సిన దుస్థితి తప్పించారు. స్వయం సహాయక సంఘాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కేసీఆర్ కిట్.. అమ్మతనానికి భరోసా. షీటీమ్స్.. ఆమెకు రక్షణ వలయం. కాబట్టే, తెలంగాణ మహిళ కేసీఆర్‌ను నాన్నగా, అన్నగా, కొడుకుగా.. అక్కున చేర్చుకున్నది.
ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకుకెళ్లి డబ్బు తెచ్చుకోవచ్చు. బ్లడ్ బ్యాంకుకెళ్లి రక్తమూ సేకరించవచ్చు. కానీ, మదర్స్ మిల్క్ బ్యాంక్‌లో స్వచ్ఛమైన అమృతం లభిస్తుంది. పసిబిడ్డ ప్రాణం నిలిపే సంజీవిని దొరుకుతుంది. ఆ అరుదైన బ్యాంకు గురించి..