అయిదుపదుల జీవితం ఆనందంగా సాగిందంటే సంతోషించాల్సిందే! ఆ తర్వాత జీవితం కూడా సంతోషంగా ఉంటే మహదానందమే కదా! యాభై దాటిన తర్వాత సహజంగానే మహిళల్లో అనేక శారీరక మార్పులు ఉంటాయి. మెనోపాజ్ దశ లక్షణాలు వస్తుంటాయి. వాటి ప్రభావంతో మానసిక సమస్యలూ ఏర్పడతాయి. మెనోపాజ్, కీళ్ల నొప్పులు వయసు పైబడుతున్న మహిళలు ఎదుర్కొనే సమస్యలు. ఫిట్‌గా ఉంటే యాభై ఏళ్ల తర్వాత వచ్చే సమస్యల్ని కూడా అధిగమించొచ్చని, వ్యాయామాలతో వయసును వాయిదా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న వయసుతోపాటే శారీరక సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలంటే మూడు రకాల వ్యాయామాలను తప్పక సాధన చేయాలి.
వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటి ఏరోబిక్ వ్యాయామాలలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని సాధన చేయాలి. ఇవి శరీరంలోని కండరాలను బలోపేతం చేస్తాయి. బరువును నియంత్రిస్తాయి. రోజుకు 20 నిమిషాలకు తగ్గకుండా వారంలో మూడు, నాలుగు రోజులు చేయాలి.
ఎముకల పటుత్వాన్ని కాపాడుకునేందుకు చేతులతో బరువులెత్తే వ్యాయామాలు చేయాలి. వీటి ద్వారా శరీరాకృతిని కూడా కాపాడుకోవచ్చు. నడుము నొప్పులు తగ్గుతాయి. చేతులకు కష్టం అనిపించనంత బరువును ఎత్తడంతో ప్రారంభించాలి. ప్రారంభంలో ఎనిమిదిసార్లు ఎత్తాలి. గరిష్టంగా 12 సార్లు చేయాలి.
కీళ్ల కదలికల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు యోగా, పైలేట్స్ని సాధన చేయాలి.