శీతాకాలపు ప్రయాణాలు అత్యంత ఆహ్లాదకరంగా సాగుతాయి. పొగమంచుతో నిండిపోయే హిల్ స్టేషన్లు.. వెండిరంగులో మెరిసే మంచు పర్వతాలు యాత్రికులను రా రమ్మని పిలుస్తుంటాయి. ఇక మంచు దుప్పటి కప్పుకొన్న కొండలపై స్కీయింగ్, స్నోబోర్డింగ్ లాంటి సాహస క్రీడలు.. అంతులేని థ్రిల్‌ను పంచుతాయి. అయితే, ఇలాంటి యాత్రలు చేయాలంటే.. చాలామంది ‘యూరప్ ట్రిప్’ వెయ్యాల్సిందే అంటారు. కానీ, మన దేశంలోనూ అంతకుమించిన అనుభూతుల్ని అందించే అందమైన పర్యాటక కేంద్రాలెన్నో ఉన్నాయి.
స్విస్ గ్రామీణ ప్రాంతాలే కాదు.. మన సిమ్లా కూడా భూతల స్వర్గమే! మంచుతో నిండిపోయే రోడ్లు, చెక్క కుటీరాలు, దట్టమైన
దేవదారు అడవులు.. స్విట్జర్లాండ్‌ను తలపిస్తాయి. ఇక ఇక్కడి వలసరాజ్యాల కాలం నాటి వారసత్వ భవనాలు.. ఆ పాత చారిత్రక వాతావరణాన్ని కళ్లకు కడతాయి. ముఖ్యంగా, శీతాకాలంలో ఈ ప్రాంతమంతా పొగమంచుతో ఆహ్లాదకరంగా
మారుతుంది. ఆకర్షణీయమైన యురోపియన్ స్పర్శను అందిస్తుంది. ప్రకృతి సౌందర్యం, సాహస క్రీడలు, స్కీయింగ్, స్కేటింగ్, యాక్, పోనీ సవారీలకు సిమ్లా ప్రసిద్ధి. ఇక్కడికి 15 కి.మీ. దూరంలోని కుఫ్రీ కూడా అద్భుతమైన సందర్శన స్థలమే! ఇక్కడ ‘కుఫ్రీ ఫన్ వరల్డ్ వైల్డ్‌లైఫ్ జూలో మంచు చిరుత పులులు, యాక్ వంటి జంతువులను వాటి సహజ ఆవాసాలలో చూడవచ్చు.
మంచు పర్వతాల్లో సందడి చేయడానికి ఆల్ఫ్స్ పర్వతాలే అవసరం లేదు. అంతకుమించిన హిమాలయాలు మన చెంతనే ఉన్నాయి. ఈ శీతాకాలంలో జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్కు ప్రయాణం కట్టండి. తెల్లటి మంచు దుప్పటి కప్పుకొన్న పర్వతాలు, పైన్ అడవులు.. ఆల్ఫ్స్ అందాలను మించిన అనుభూతిని అందిస్తాయి. ఇక్కడి మంచు కూడా మందంగా, నిర్మలంగా ఉంటుంది. స్కీయింగ్, స్నోబోర్డింగ్, మౌంటెన్ బైకింగ్, ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రికులకు గుల్మార్గ్ స్వర్గధామమే! ఇక్కడి గండోలా రైడ్.. ప్రపంచంలోనే ఎత్తయిన కేబుల్ కార్లలో ఒకటి.
ప్రశాంతమైన పచ్చిక మైదానాలలో సేదతీరేందుకు ఆస్ట్రియా వెళ్దామని ఆలోచిస్తున్నారా? వెంటనే విరమించుకోండి. ఉత్తరాఖండ్‌లోని ‘ఔలీ’ని సందర్శిస్తే.. ‘ఔరా!’ అనాల్సిందే! ఇక్కడి ఎత్తయిన పర్వతాలు, పచ్చికబయళ్లు. ఆస్ట్రియాలోని ప్రశాంతమైన శీతాకాలపు గ్రామాలను గుర్తుకు తెస్తాయి. ఇక్కడికి ప్రయాణం కట్టేస్తే.. హిమాలయ శిఖరాల మధ్య స్కీయింగ్, ట్రెక్కింగ్లాంటి సాహసయాత్రలతోపాటు పచ్చిక మైదానాల్లో ప్రశాంతతనూ ఆస్వాదించొచ్చు. స్కీయింగ్, కేబుల్ కార్ (రోప్‌వే), రైడ్ చైర్ లిఫ్ట్, నందా దేవి, కామత్ పర్వతాలు.. అద్భుతమైన అనుభూతుల్ని పంచుతాయి. అందుకే.. ప్రొఫెషనల్ స్కీయర్లతోపాటు ఔత్సాహికులూ ఔలీని వాచ్‌లిస్ట్‌లో తప్పకుండా చేర్చుకుంటారు.