అసూయ అనేది ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఉంటుంది. ఆడైనా.. మగైనా.. అసూయ పడటం కామన్. అయితే, ‘మహిళలు – పురుషులు’.. ఒకరిపై ఒకరు ఎలా అసూయపడతారో ఇటీవలి ఓ అధ్యయనం విశ్లేషించింది. ‘ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ’లో ప్రచురితమైన ఈ పరిశోధన అనేక విషయాలను వెల్లడించింది.
ఆడవాళ్లపై సాధారణంగా ఉండే ఆంక్షలు, కట్టుబాట్లు.. వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయట. అందుకే, ఎక్కువమంది మహిళలు కనీసం ఒక్కరోజైనా మగవాడిలా జీవించాలని కోరుకుంటున్నారట. భద్రతాకారణాల వల్ల రాత్రి సమయాల్లో తమను ఇంటికే పరిమితం చేయడం, తాము ఎక్కడికి వెళ్తున్నామనే విషయంతోపాటు భద్రంగానే ఉన్నామని ఇంట్లో వారికి ఎప్పటికప్పుడు తెలియజేయడం లాంటివీ.. కొందరిని ఇబ్బంది పెడుతున్నాయట. ఇక మగవారికి సహజంగానే లభించిన సామాజిక హక్కులు, జీవితంలో వాళ్లు అనుభవిస్తున్న స్వేచ్ఛను చూసి మహిళలు తరచుగా అసూయపడతారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. సాంఘిక అధికారాలలోనూ మగవాళ్లు ముందుండటం, ఉద్యోగాల్లో అధిక జీతాలు పొందడం, కెరీర్లో ముందుకెళ్లడానికి మెరుగైన అవకాశాలు ఉండటం కూడా ఆడవాళ్లలో అసూయను పెంచుతున్నదట.
మరోవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ భారం లేకుండా.. మగవాళ్లు జీవితాన్ని గడుపుతుండటం కూడా ఆడవాళ్లలో ఈర్ష్యకు కారణమవుతున్నది. ఆరోగ్యం విషయానికి వస్తే.. రుతుస్రావం, ప్రసవం లాంటి సవాళ్లు మగవాళ్లకు లేకపోవడం ఆడవాళ్ల అసూయకు మరో కారణం. ఇక వృద్ధాప్యంలోనూ.. మగవాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాల నుంచి విరమణ పొంది విశ్రాంతిగా ఉంటే.. మహిళలకు మాత్రం ఇంటి చాకిరీ తప్పదు. ఆడవాళ్లలో 60 ఏండ్లు దాటిన తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తుండటం వారిలో అసూయకు కారణమని తేలింది.
ఆడవాళ్లలో అందం, ఆకర్షణ.. మగవారిని అసూయ పడేలా చేస్తున్నాయట. ఈ రెండు ప్రత్యేక అధికారాలతో ఆడవాళ్లు ఏ పనినైనా సులభంగా చేయగలుగుతారని మగాళ్లు నమ్ముతున్నారు. మహిళల్లో ఎక్కువగా ఉండే దయాగుణం కూడా మగవారిపై పైచేయి సాధిస్తున్నది. ఈ సద్గుణంతో ఆడవాళ్లు అందరి మన్ననలూ పొందడం.. పురుషులను ఈర్ష్య పడేలా చేస్తున్నదట. భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తీకరించే స్వేచ్ఛ తమకు లేదని మగవాళ్లు వాపోతున్నారట.
ఈ విషయంలో ఆడవాళ్లే ముందున్నారు. ఒకే సమయంలో అనేక బాధ్యతలను సులువుగా నిర్వహించే సామర్థ్యం ఆడవాళ్లలో ఎక్కువ. వారి సామర్థ్యం పురుషుల్లో ఈర్ష్యకు ఆజ్యం పోస్తున్నది. ఈ ప్రపంచంలోకి ఒక కొత్త ప్రాణిని తీసుకువచ్చే మహిళల ప్రత్యేక సామర్థ్యాన్ని చూసి తాము అసూయ పడుతున్నట్లు ఎక్కువమంది మగవాళ్లు ఈ అధ్యయనంలో అభిప్రాయపడటం విశేషం.