పిల్లల్లో అప్పుడప్పుడూ కనుబొమలు, కనురెప్ప, మూతి కొట్టుకుంటూ ఉంటాయి. అలాగే మెడ కదలడం, కూర్చున్నప్పుడు శరీరంలో వణుకు వస్తాయి. ఇది అలవాటేమోనని పెద్దవాళ్లు మందలిస్తారు. ఆ కదలికలను పిల్లలు ఆపలేరు. అవి నియంత్రణ లేకుండా, అకస్మాత్తుగా, వేగంగా వస్తాయి. సందర్భం, కారణం ఉండదు. ఇలా మళ్లీ మళ్లీ జరుగుతుంటే ఈ కదలికలను ‘టిక్స్’ అంటారు. ఒకచోట కదలిక వస్తే ‘సింపుల్ టిక్స్’ అంటారు. రెండు నుంచి మూడు రకాల మూవ్మెంట్స్ (ఒకసారి చేయి కదిలిన తర్వాత మెడ కదిలి, ఆ తర్వాత ఫేస్‌లో కదలిక) ఒకదాని తర్వాత మరొకటి ఉంటే దానిని ‘కాంప్లెక్స్ టిక్స్’ అంటారు. కొంతమందిలో మాటలో కూడా ఈ సమస్య ఉండొచ్చు. దీనిని ‘ఫోనిక్ టిక్స్’ అంటారు.
టిక్స్‌ని నిర్ధారించడానికి ప్రత్యేకమైన పరీక్ష లేదు. డాక్టర్ సాధారణ పరిశీలనతో గుర్తించగలరు. కదలికలు వచ్చినప్పుడు ‘ఆపుకోగలుగుతున్నావా?’ అని పిల్లల్ని అడిగితే ‘ఆపుకోగలను. కానీ, అది చేస్తేనే మెంటల్‌గా మంచి ఫీల్ ఉంటుంది’ అని చెబితే అది టిక్సేనని నిర్ధారించుకోవచ్చు. టిక్స్ సమస్య ఉన్న పిల్లల్లో ఎక్కువమందిలో ఏడీహెచ్, బిహేవియరల్ సమస్యలు ఉంటాయి. బ్రెయిన్లో జరిగే సాధారణ చర్యలు సరిగా జరగనప్పుడు, బ్రెయిన్ నుంచి ఫిల్టర్ అయి బయటికి రావాల్సినవి పూర్తిగా బయటికి రాలేకపోతే టిక్స్ వస్తాయి. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా రావొచ్చు. వీటికి జన్యుకారణం. మిగతావారిలో బాడీలో స్ట్రెస్ (ఇన్ఫెక్షన్ వల్ల), నిద్రలేమి ఉన్నప్పుడే ఈ సమస్యలు ఎక్కువగా బయటపడతాయి.
నరాల సమస్య, ఇతర జబ్బుల వల్ల టిక్స్ రావొచ్చు. అసలు సమస్యను తెలుసుకోవడానికి రక్త పరీక్ష, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. టిక్స్ సమస్య దానికదే తగ్గుతుంది. మళ్లీ తీవ్రమవుతుంది. టిక్స్ వల్ల నొప్పి, అసౌకర్యం, శబ్దాలు ఉంటే బిహేవియరల్ థెరపీ ద్వారా వాటిని నియంత్రించుకునేలా శిక్షణ ఇవ్వాలి. కొందరికి మందులు ఇవ్వాలి. ఏడీహెచ్‌డీ (హైపర్ యాక్టివిటీ), ఓసీడీ సమస్యలు ఉంటే వాటికి మందులు ఇస్తే టిక్స్ కూడా తగ్గుతాయి. కొందరిలో ఏడీహెచ్‌డీకి ఇచ్చే మందుల వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్‌గా టిక్స్ వస్తాయి. ఇది సాధారణ సమస్యే. ప్రతి అయిదుగురిలో ఒకరికి ఈ ఇబ్బంది ఉంటుంది. ఆరు, ఏడు సంవత్సరాల వయసులో ఈ సమస్య ప్రారంభమవుతుంది. పది నుంచి పన్నెండేళ్ల మధ్య తీవ్రంగా ఉంటుంది. పద్దెనిమిదేళ్లకు పోతుంది. బిహేవియరల్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లలో ఇంకా ఎక్కువకాలం ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా తీవ్రమైన నష్టం కలిగించే సమస్య కాదని తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. ఆందోళన వద్దు.