ఒక పెద్ద కల్యాణ మంటపంలో పెళ్లి జరుగుతున్నది. అది సంపన్నుల పెండ్లి. ఖరీదైన ఆహ్వాన పత్రిక అందుకున్న ఒక పండితుడు ఆ పెళ్లి విందుకు వెళ్లాడు. జనం దండిగా ఉన్నారు. నోరూరించే వంటకాలతో చక్కటి విందును ఏర్పాటు చేసి ఉన్నారు. ఒక్కో ప్లేటు భోజనం ఖర్చు వెయ్యి రూపాయలకు పైగా ఉంటుందని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు పండితుడు. పల్లెలకు వెళ్లి ప్రవచనాలు చెప్పే ఆ పండితుడిని గుర్తించిన చాలామంది పలకరించారు.
వచ్చిన వారిలో చాలామంది భోజనం చాలా రుచిగా ఉందని నిర్వాహకులను అభినందించారు. ఇంతలో ఒక యువకుడు పండితుడి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. తాను హరికథలు చెప్పే భాగవతార్ను అని పరిచయం చేసుకున్నాడు. మీ ప్రవచనాలు నన్నెంతగానో ఆకర్షిస్తాయని అన్నాడు. అయితే తనను ఓ సమస్య ఎంతో ఇబ్బంది పెడుతోందని వాపోయాడు. అదేమిటంటే, పల్లెల్లో హరికథలను ఎంత బాగా చెప్పినా ఎవరో ఒకరు విమర్శ చేస్తున్నారని బాధపడ్డాడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా ఇవ్వమని అడిగాడు.
ఇద్దరిదీ భోజనం పూర్తయ్యింది. చక్కటి భోజనం తిన్నామని ఇద్దరూ సంతోషించారు. చేతులు కడిగే కుళాయి దగ్గర ఒకతను చేయి కడుక్కుంటూ పక్క వ్యక్తితో ఇలా చెబుతున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు. అయితే నా అరటి ఆకులో వేసిన వడియం సరిగ్గా కాలలేదు.
అది కూడా చూసుకోకపోతే ఎలా? ఇన్ని లక్షలు ఖర్చుపెట్టి ఏమి ప్రయోజనం? అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పండితుడు పక్కనే ఉన్న భాగవతార్ తో ‘చూశావా… ఇంత మంచి భోజనాలు ఏర్పాటు చేసినా, వేగని వడియం తనకు వచ్చిందని మొత్తం భోజనాలని, పెళ్లి నిర్వాహకులను తిట్టి పోస్తున్నాడు. నూటికి నూరు శాతం కచ్చితత్వం చాలా సందర్భాల్లో కుదరదు. విమర్శలనే భూతద్దంలో చూస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాం. ముందుకు పోలేం. కాబట్టి వాటిని పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుపో’ అని ధైర్యం చెప్పాడు. మంచి సమాధానం దొరికిందని సంతోష పడ్డాడు భాగవతార్. ఇద్దరూ తాంబూల సేవనం చేసి అక్కడి నుంచి బయటికి వచ్చారు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు ,93936 62821