బాలీవుడ్‌లోని కొందరు నటులు పారితోషికం భారీగా తీసుకున్నా.. రెండు లైన్ల డైలాగులను కూడా సరిగ్గా చెప్పలేరని దుయ్యబట్టాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. 2007లో ఆయన దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది ‘ధన్ ధనాధన్ గోల్’. ఈ సినిమా కోసం తన సృజనాత్మకను మొత్తం త్యాగం చేసినట్లు చెప్పాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానేతో కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ గురించిన విషయాలను పంచుకున్నాడు. “గోల్ సినిమాతో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను.
ముఖ్యంగా.. అందులోని నటీనటులు తాము రెండు లైన్ల కంటే ఎక్కువ సంభాషణలు చెప్పలేమనీ, ఇన్ని మాత్రమే చెబుతామని నిబంధనలు పెట్టారు” అంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు వివేక్ అగ్నిహోత్రి. అయితే, ఈ సినిమాలో చాలా గొప్ప సంభాషణలు రాసుకున్నారట. ముఖ్యంగా, అనురాగ్ ఎంతో కష్టపడి భారీ డైలాగ్స్ రాశాడనీ, సినిమా నటులు అతన్ని కలిసి.. డైలాగ్స్‌ను తగ్గించమని, కొన్నిటిని తీసేయమని అడిగేవారని వివేక్ వెల్లడించాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. “ఫుట్‌బాల్ ఆట చుట్టూ తిరిగే ఈ సినిమా పూర్తయ్యాక, విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా ఒక పాటను జోడించాలని నిర్మాతలు చెప్పారు.
‘బిల్లో రాణి’ పాట అలా వచ్చిందే! ఆ పాట బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, నేను మాత్రం సంతృప్తి చెందలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాకు అవసరం లేకున్నా.. కేవలం నటీనటుల కోసమే ఆ పాటను పెట్టాల్సి వచ్చిందట. “ఎందుకంటే ఈ పాట ద్వారానే వారికి ప్రమోషన్ లభిస్తుంది. వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వారికి టెలివిజన్ షోలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు లభిస్తాయి. అందుకే, ఆ పాటను పెట్టాలని వారు పట్టుబట్టారు” అని వెల్లడించాడు. ఆ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన జాన్ అబ్రహంతోనూ ఇబ్బందులు పడ్డట్లు వివేక్ చెప్పాడు.
“జాన్‌పై షాట్ ఉన్నప్పుడు అతని ముఖం, కాళ్లను విడిగా చిత్రీకరించాల్సి వచ్చింది. ఒకేసారి నాలుగైదు లైన్ల డైలాగ్స్‌ను కూడా సరిగ్గా చెప్పలేడు. అయినా, పారితోషికం మాత్రం భారీగా తీసుకుంటాడు” అంటూ విమర్శలు గుప్పించాడు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ధన్ ధనాధన్ గోల్’లో జాన్ అబ్రహం, అర్షద్ వార్సీ, బోమన్ ఇరానీ, బిపాషా బసు లాంటి అగ్రతారాగణం నటించారు. ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందాడు వివేక్ అగ్నిహోత్రి. 2005లో చాక్లెట్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ది తష్కెంట్ ఫైల్స్ (2019) చిత్రంలో ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రచయితగా జాతీయ అవార్డునూ అందుకున్నాడు.