జీ5: నవంబర్ 28
తారాగణం: నరేష్ అగస్త్య,
మేఘా ఆకాష్, శిజు మీనన్,
రఘు కుంచె తదితరులు
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
డిటెక్టివ్ కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక్కో పేజీ తిప్పిన కొద్దీ.. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి కథలతో వచ్చే వెబ్ సిరీస్‌లు కూడా అంతే! ఒక్కో ఎపిసోడ్ గడుస్తున్న కొద్దీ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడతాయి. సిరీస్ ఆసాంతం స్క్రీన్ వదలకుండా చేస్తాయి. అలాంటి కథతో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పీరియాడిక్ ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్.. వికటకవి. జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ తెలుగు వెబ్ సిరీస్.. హిట్‌టాక్‌తో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది.
1970 దశకంలో అమరగిరి సంస్థానం వేదికగా కథ నడుస్తుంది. అక్కడి దేవతలగుట్టకు అమ్మవారి శాపం ఉన్నదని స్థానికులు నమ్ముతుంటారు. ఆ ప్రాంతానికి వెళ్లినవారు వింతగా ప్రవరిస్తుంటారు. తమ గతాన్ని మర్చిపోతుంటారు. దాంతో అమరగిరి రాజు రాజా నరసింహారావు (శిజు మీనన్)కు బెంగ పట్టుకుంటుంది. ఎలాగైనా తన ప్రజలను కాపాడాలని అనుకుంటాడు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో తెలివైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకుంటాడు రామకృష్ణ (నరేష్ అగస్త్య). తన తెలివితేటలతో అనేక సమస్యలను తేలిగ్గా పరిష్కరిస్తూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. కానీ, అందుకు కావాల్సిన డబ్బు లేక బాధపడుతుంటాడు.
అదే సమయంలో అమరగిరి సమస్య అతని దృష్టికి వస్తుంది. దాన్ని పరిష్కరించి, వచ్చిన డబ్బుతో తల్లికి ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి అమరగిరికి వెళ్లిన రామకృష్ణకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు దేవతల గుట్ట మీద ఏం జరుగుతుంది? గుట్టపైకి వెళ్లినవారు తమ గతాన్ని ఎందుకు మర్చిపోతుంటారు? రాజా కొడుకు మహదేవ్ (తారక్ పొన్నప్ప) గతం ఏంటి? తెలివైన విద్యార్థిగా అందరి మన్ననలు అందుకున్న రామకృష్ణ.. అమరగిరి సమస్యను పరిష్కరించాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ని వీక్షించాల్సిందే!