హైదరాబాద్‌లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? ప్రశ్న వింతగా ఉంది కదూ? ఈ ప్రశ్నతోనే ఒక అన్వేషణ ఆరంభమైంది. సర్కారు బడులను బతికించాలనే తపన మొదలైంది. ఏకంగా ‘ఉడాన్ వలంటరీ ఆర్గనైజేషన్’ పేరుతో ఒక వ్యవస్థ ప్రాణంపోసుకుంది. ‘ఉడాన్’ ద్వారా 30 స్కూళ్లను దత్తత తీసుకొని చదువులు నేర్పడంతోపాటు నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు చారు షా!
ఆగస్టు 2.. చారూ షా వాళ్ల అమ్మగారి పుట్టినరోజు. ఏటా తల్లి బర్త్‌డేను పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకుంటారామె. ఎప్పట్లానే 2011లో కూడా స్వీట్లు పంచడానికి కొన్ని కార్పొరేట్ స్కూల్స్‌ను ఎంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉంటాయని అప్పటిదాకా ఆమెకు తెలియదు. మొత్తానికి, పాటిగడ్డలోని బండిమెట్ గవర్నమెంట్ స్కూల్‌కు వెళ్లారు. పిల్లలకు స్వీట్లు పంచడానికి హెడ్ మాస్టర్ అనుమతి తీసుకున్నారు. ‘స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతాను’ అని అడిగారు. వందల మంది విద్యార్థులను కదిలించినా, ఒక్కరు కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడలేకపోయారు. ఆ మాటే హెచ్ఎంతో చెప్పారు. ‘మా విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పిస్తే అదే పదివేలు’ అన్నారాయన. చారు వాళ్లది వ్యాపార కుటుంబం. ఆమె చదివింది అంతా కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే. అందరిలానే తనూ వ్యాపారంలోకి వెళ్తుందని అనుకున్నారంతా. కానీ బోధన వృత్తిని ఎంచుకున్నారు. ఏడేండ్ల పాటు కార్పొరేట్ స్కూళ్లలో పనిచేశారు. అందుకే, ప్రతీది విద్యార్థుల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. నిరుపేద పిల్లల్లో కెరీర్ నైపుణ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా 2011లో ‘ఉడాన్’ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. కొంతకాలం బండిమెట్ స్కూల్లో ఇంగ్లిష్ బోధించారు. మంచి ఫలితం కనిపించడంతో సేవలను విస్తరించాలని భావించారు.
‘ఏ స్కూల్లో చేస్తున్నారు? జీతం ఎంత వస్తుంది?’.. అని ఎవరైనా అడిగితే ‘ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా ఇంగ్లిష్ బోధిస్తున్నా’ అని చెప్పేవారు చారూ. కల్ప గొండేల్కర్, శ్రీదేవి వెల్లూరి, సోనాల్ విక్రమ్ దోషి, నీతా నీరజ్ షా, ఆశిష్ షా, సరితా చిమల్గి, కవిత బూరుగు.. తదితరులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. వీరిలో డాక్టర్లు ఉన్నారు. ఇంజినీర్లు ఉన్నారు. వ్యాపార వేత్తలూ ఉన్నారు. అలా వలంటీర్ల సంఖ్య 150కి చేరుకుంది. ఒక్కో పాఠశాలలో ఏడెనిమిది మంది వరకూ పనిచేస్తారు. ఎవరూ నయా పైసా కూడా తీసుకోరు. ఎవరికీ హోదాలు ఉండవు. కొవిడ్ కారణంగా మధ్యలో స్వచ్ఛంద సేవకుల సంఖ్య తగ్గింది. అయినా కొత్తవాళ్లు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉడాన్ బృందంలో 135 మంది ఉన్నారు.
చదువు, ఉద్యోగం, వ్యాపారం దేనికైనా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఈ నైపుణ్యాలను ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు అందిస్తే.. ఉన్నత స్థానాల్లో స్థిరపడతారన్నది ఉడాన్ సిద్ధాంతం. ఉడాన్ ద్వారా ఇప్పటివరకు 30 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. 11 చోట్ల్ల ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అవసరం ఉన్న ప్రతీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నారు. ఉడాన్ నీడన శిక్షణ తీసుకున్నవాళ్లు ప్రపంచ నలుమూలలా ఉన్నారు. అందుకే ఉడాన్ సర్టిఫికెట్‌కు మంచి గుర్తింపు ఉంది. గత ఆరేండ్లుగా ఏటా ఇరవై వేల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఉత్తమ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారు. బ్యాడ్మింటన్, వాలీబాల్, రగ్బీ వంటి క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఆనంద్ కిమ్తి మెమోరియల్, ఇక్రి ఎడ్ ఆర్గనైజేషన్, జితో యూత్, లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ఉదారంగా విరాళాలు ఇస్తున్నాయి. ఉడాన్ దత్తత తీసుకున్న అన్ని పాఠశాలల్లోనూ ఆరు నుంచి పది తరగతుల పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ నేర్పిస్తున్నారు. జిల్లాలకూ సేవలను విస్తరించాలనేది ఉడాన్ లక్ష్యం. ఆ ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు. ఒకసారి ఓ స్కూల్‌ను దత్తత తీసుకుందామని వెళ్తే.. సిబ్బంది అడ్డు చెప్పారు. ‘జిల్లా అధికారుల పర్మిషన్ కావాలి’ అంటూ వెనక్కి పంపారు. ‘సర్కారు బడికి సేవ చేయడానికి వచ్చాం. వాటి నుంచి లబ్ధి పొందడానికి కాదు’ అని చెప్పినా అర్థం చేసుకోలేదు. ఇప్పటివరకు ఉడాన్ తొమ్మిదివేల మంది విద్యార్థులకు ఇంగ్లిష్, కంప్యూటర్స్, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చింది. వివిధ స్కూళ్లలో వర్క్‌షాప్‌లు, అవేర్నెస్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నది. ఉడాన్‌లో వలంటీర్లుగా చేరాలనుకుంటే charushah42@ gmail.com /9391233381 ద్వారా సంప్రదించవచ్చు.
…✍ దాయి శ్రీశైలం, 📷జి.భాస్కర్