ఒకప్పుడు కూతుళ్లు నాన్న ఇంట్లో ఉన్నంత సేపూ కిక్కురుమంటే ఒట్టు! అమ్మపై సివంగుల్లా విరుచుకుపడినా.. నాన్న సైకిల్ బెల్ వినపడగానే చిట్టెలుకల్లా గదిలోకి దూరిపోయేవారు. ఇప్పటి కూతుళ్లు… నాన్నకు, అమ్మకు స్నేహితులు. ఆఫీస్ నుంచి వచ్చేసరికి తనను అమాంతం హత్తుకునేందుకు సిద్ధంగా ఉన్న చిట్టితల్లిని చూడగానే నాన్న పనిభారం అంతా హుష్ కాకి. అంత అలసటలోనూ ఆకాశమంత ఉత్సాహం పుట్టుకొస్తుంది ఆయనలో! చిన్నప్పుడు అమ్మకూచిగా ఉన్న చిట్టెమ్మ.. పెద్దయ్యాక మాత్రం నాన్నకూచే! ఓ పదేండ్ల కిందటివరకు కూతురు ప్రతి అవసరానికీ తండ్రి దగ్గర అమ్మ సిఫారసు చేయాల్సి వచ్చేది. అమ్మ అవసరాలకు కూడా తనే రెకమెండ్ చేసేంతగా తండ్రి దగ్గర స్వేచ్ఛను దొరకబుచ్చుకుంది నేటి కూతురు. ముమ్మాటికీ ఈనాటి కూతుళ్లు అదృష్ట వంతులు! తను పుట్టినప్పుడు దవాఖానలో ఆనందంగా మిఠాయిలు పంచిన వ్యక్తి తండ్రిగా లభించినందుకు. ఈనాటి తండ్రులూ అదృష్టవంతులే.. అన్ని రంగాల్లో మేటిగా రాణిస్తూ తన పేరును నిలబెట్టే కూతుళ్లు ఉన్నందుకు.