కొందరికి ప్రయాణాలంటే చచ్చేంత భయం! బండి రోడ్డెక్కిందో లేదో.. భళ్లున వాంతి కావడమే అందుకు కారణం. ‘మోషన్ సిక్నెస్’గా పిలిచే ఈ సమస్య.. రెండేళ్ల నుంచి 12 ఏళ్లలోపు వారిలోనూ, ఆడవాళ్లలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ముగ్గురిలో ఒకరిని ఈ ఇబ్బంది వేధిస్తుంది. ఆటో, కారు, బస్సు, రైలు, విమానం అనేకాదు.. ఓడల్లో ప్రయాణం చేసినా.. ఇట్టే వాంతి అవుతుంది. ఈ సమస్యకు కారణాలు అనేకం.
చెవిలో ఉండే ‘లాబ్రింథైస్’ అనే భాగానికి ఇబ్బంది కలగడం వల్లే ప్రయాణాల్లో తల తిరగడం, వాంతులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ భాగం పరిశుభ్రంగా లేకపోయినా, ఇన్ఫెక్షన్ వల్ల చీముపట్టినా ‘లాబ్రింథైస్’ దెబ్బతింటుంది. ప్రయాణంలో ముందుకూ – వెనక్కీ ఊగడం, పైకీ – కిందికీ ఎగరడం వల్ల చెవిలోని ‘లాబ్రింథైస్’ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇది మోషన్ సిక్నెస్కు కారణమవుతుంది. అలాంటప్పుడు బాధితుల చెవులు మూయడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. చెవుల్లోకి గాలి వెళ్లనీయకుండా చేసి ‘లాబ్రింథైస్’పై ఒత్తిడి తగ్గిస్తే.. వాంతులు రాకుండా చూసుకోవచ్చు. ఇక నిమ్మకాయ, అల్లం రుచి చూడటం వల్ల కూడా వాంతులు రాకుండా అడ్డుకోవచ్చు. నిమ్మకాయలో ఉండే ఎసిడిక్ ఆమ్లాలు వాంతులను నిరోధిస్తాయి. అల్లం.. వికారాలను తగ్గిస్తుంది. అందుకే, ప్రయాణాల్లో తరచుగా వాంతులు చేసుకునేవాళ్లు నిమ్మకాయ, అల్లం ముక్క పట్టుకుని వెళ్లడం మంచిది. అలాగే, మోషన్ సిక్నెస్ ఉన్నవాళ్లు వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోవద్దు. ప్రయాణాల్లో పుస్తకాలు చదవడం, ఫోన్ చూడటం మానేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. ప్రయాణంలో వాంతులు వస్తాయనే విషయాన్ని మెదడులోకి రానీయకూడదు. ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. ప్రయాణాలను సాఫీగా సాగించొచ్చు.