తల్లిగర్భంలోని బిడ్డకు రక్షణ కవచంగా ఉండేది.. ఉమ్మనీరు. గర్భస్థ పిండానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా, దెబ్బ తగలకుండా.. అన్నిరకాలుగా అండగా నిలుస్తుంది. అయితే, నెలలు నిండుతున్న కొద్దీ కొందరిలో ఉమ్మనీరు తగ్గుతుంటుంది. అలాంటి సమయంలో బిడ్డకు సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా ఉండేందుకు, శరీరంలో ఉమ్మనీరు పెరిగేందుకు కొన్నిరకాల ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి.
ఉమ్మనీరు పెరగాలంటే.. సరిపడా నీళ్లు తాగాలి. తాజా పండ్ల రసాలు కూడా ఉమ్మనీరు వేగంగా పెరగడానికి సాయపడుతాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా, పాలకూర, బ్రకొలీ, టమాట, క్యాలీఫ్లవర్, క్యారెట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాలతో శరీరానికి సరిపడా నీరు అందుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లలోనూ నీరు ఎక్కువగా లభిస్తుంది. కొబ్బరి నీళ్లు తీసుకోవడం కూడా గర్భిణులకు చాలామేలు చేస్తుంది. ఉమ్మనీటిని పెంచడంతోపాటు కొబ్బరి నీళ్లలోని పోషకాలు.. రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయి.