సోంపు గింజల్లో యాంటి ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి, జుట్టు ఆరోగ్యంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక సోంపు గింజల్లోని విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం.. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు తన సహజ రంగును కోల్పోకుండా కాపాడతాయి కూడా. ఈ క్రమంలో.. సోంపు గింజలతో హెయిర్ కేర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల సోంపు గింజలను వేసి.. సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి ఒక స్ప్రే బాటిల్లో పోయాలి. దీన్ని వారానికి రెండు మూడుసార్లు జుట్టు కుదుళ్లకు స్ప్రే చేసి మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే.. తెల్ల జుట్టు సమస్య క్రమంగా తగ్గుతుంది.
సోంపు గింజలను మెత్తని పొడిలా చేసుకోవాలి. హెన్నా హెయిర్ ప్యాక్ వేసుకునే సమయంలో.. అందులో రెండు స్పూన్ల సోంపు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని టీ డికాక్షన్‌తో కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు జుట్టుకు పట్టించి.. రెండు గంటల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఈ ప్యాక్ జుట్టుకు ముదురు రంగును, మెరుపును అందిస్తుంది. అంతేకాదు.. సోంపులో ఉండే యాంటి ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ సోంపు గింజలు ముందుంటాయి.