యశ్వంత్.. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్, కేరాఫ్ సీతాఫల్మండి. కొన్నాళ్ల కిందటివరకు ఈ యువకుడి పరిచయం ఇంతే! ఇప్పుడు కెనడాలో డ్యాన్స్ మాస్టర్‌గా స్థిరపడ్డాడు. ‘నా ఆట చూడు.. నాటు నాటు’ అంటూ అక్కడివారితో స్టెప్పులు వేయిస్తున్నాడు. కెనడా నాడి పట్టుకొని ఆడిస్తున్న హైదరాబాదీ యశ్వంత్ పరిచయం ఇది.
యశ్వంత్ పుట్టింది, పెరిగింది సీతాఫల్మండిలోనే. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే అభిమానం. అలా అని చదువులను నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డ్యాన్స్‌పై దృష్టి సారించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు. టీవీ చానళ్ల డ్యాన్స్ కాంటెస్ట్‌లలో వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగిన షోలలో సత్తా చాటుకున్నాడు. 2015లో ఉన్నతవిద్య కోసం కెనడా వెళ్లాడు యశ్వంత్. చదువుకుంటూనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. స్నేహితుల ప్రోత్సాహంతో 2018లో టొరంటోలో ‘రేంజ్ యశ్ డ్యాన్స్ అకాడమీ’ని స్థాపించాడు. వందలాది మందికి శిక్షణ ఇచ్చాడు. అంతర్జాతీయ ఈవెంట్లలోనూ పాల్గొన్నాడు. టొరంటో ఇంటర్నేషనల్ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్, లెజెండ్ మ్యూజికల్ నైట్, రిథమ్స్ ఆఫ్ వరల్డ్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చాడు.
టొరంటోలో ‘సల్మాన్‌ఖాన్ దబాంగ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక టూర్‌కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సేవలందించాడు. పలువురు అంతర్జాతీయ కళాకారుల మ్యూజిక్ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. తన సంపాదనలో కొంతభాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు యశ్వంత్. ఈ యువకుడి విజయగాథను ‘బాంబే ఫిలిం ప్రొడక్షన్’ పత్రిక కవర్‌స్టోరీగా ప్రచురించింది.
– మధుకర్ వైద్యుల