దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్
అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్
(భగవద్గీత – 17వ ఆధ్యాయం…20, 21, 22)
దీయతే ఇతిదానం.. అవతలి వ్యక్తికి ఉపయుక్తమయ్యేది ఇవ్వడం దానం అనిపించుకుంటుంది. దానాన్ని మూడు విధాలుగా చెబుతారు. అడిగినవారికి అడిగినది ఇచ్చేవాడు దాత. అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చేవాడు వదాన్యుడు. అడగకుండానే అనుగ్రహించేవాడు ఉదారుడు. అలాగే పుణ్యాన్నో మరే ప్రయోజనమో ఆశించి ఇచ్చినా.. ఇచ్చిన దానికి ప్రతిగా మరొకటి తీసుకున్నా అది వ్యాపారం అవుతుందే కాని దానం కాదు. ఇతరుల మెప్పు కోసం, గొప్ప కోసం ఇచ్చేది లేదా అపాత్రులకు ఇచ్చేది కూడా దానం అనిపించుకోదు. దాన లక్షణాలను భగవద్గీత.. సాత్విక, రాజస, తామస దానాలుగా చూపింది. నిష్కామంగా అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా, సరైన స్థలంలో సరైన కాలంలో, వ్యక్తి పాత్రాపాత్రతలను గుర్తించి, ఇచ్చే దానం సాత్త్విక దానం. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతిఫలాన్ని ఆశించి, సముచితంగా చేసేదానం రాజస దానం. స్థలకాల, అర్హత నియమాలేవీ పాటించకుండా అవివేకంగా, అనుచితంగా.. నిర్లక్ష్యంగా ఇచ్చేది తామస దానం.
దానం ఎలా చేయాలో తైత్తరీయ ఉపనిషత్తు శిక్షావల్లిలో చక్కగా చెపుతుంది. శ్రద్ధయా దేయమ్.. శ్రద్ధతో (భక్తితో) ఇవ్వాలి, అశ్రద్ధయా అదేయమ్.. అశ్రద్ధగా ఇవ్వకూడదు, శ్రియా దేయమ్.. శక్తి మేరకు, సమృద్ధిగా ఇవ్వాలి.. హ్రియా దేయమ్.. వినయంతో ఇవ్వాలి, భియా దేయమ్.. బాధ్యతతో ఇవ్వాలి, సంవిదా దేయమ్, వివేకంతో, అర్హత చూసి ఇవ్వాలి.. శ్రద్ధ, వినయం, వివేకం కలగలిపిన భావనతో హృదయపూర్వకంగా ఇచ్చేదానమే ఉత్తమమైనది. హృదయం అనేది అంతఃకరణానికి సంబంధించినది. అంతఃకరణ శుద్ధిగా దానం చేయాలి. హృదయాన్ని ప్రతీకాత్మకంగా చెపితే ‘హృ’ అంటే తీసుకోవడం, ‘ద’ అంటే ఇవ్వడం, ‘యం’ అంటే యానం, నడక.. ఉదాత్తమైన భావనలను నలు మూలల నుంచి గ్రహించి, సమున్నత సమాజ నిర్మాణంలో సాధించిన విజ్ఞానాన్ని భిత్తికలుగా అందిస్తూ.. జ్ఞానమార్గాన్ని అర్హులకు అందించే జ్ఞానధనులందరూ దాతలే.
నిజానికి, అడగడం, ఇవ్వడం రెండూ అద్భుత సన్నివేశాలు. ఆ సందర్భంలో యాచించే వాడు ఎంత గొప్పవాడయినా చేయి చాస్తాడు, ఎదుటి వాని ఆధిక్యతను అంగీకరిస్తాడు. వాని చేయి కింద ఉంటుంది. ఇచ్చే వాడూ చేయి చాస్తాడు. తీసుకునే వాని గొప్పదనాన్ని గుర్తిస్తాడు. వాని చేయి పైన ఉంటుంది. ఈ ప్రక్రియలో ఇచ్చేవాడు, ‘నేను’, ‘ఇస్తున్నాను’ అనే అహంభావాన్ని తెలిసిగాని, తెలియకగాని ప్రదర్శిస్తాడు. ఆ అహంకారం తామస, రాజస, సాత్విక అహంకారాలుగా ప్రదర్శితమవుతుంది. తీసుకునే వానిపై ఆధిక్యతాభావన చూపితే అది తామస అహంకారం అవుతుంది. ఉన్నది పంచుకుంటున్నాననే భావనతో ఇస్తే అది రాజస అహంకారం. ఇవ్వడం వల్ల నా సంపద చరితార్థమవుతుందనే భావనతో ఇవ్వడం సాత్విక అహంకారం అవుతుంది. ఏ భావనా లేకుండా ఇవ్వడం దివ్యత్వమవుతుంది.
ఈ సన్నివేశాన్ని మరొక విధంగా చూస్తే…. అడగడం- అమాయకత, అభిలాష – ఇస్తాడా లేదా తెలియదు. ఇస్తే ఎంత ఇస్తాడనే అంచనా లేదు. ఇందులో ఆశ ఉంది, ఆశ్చర్యం ఉంది. ఇది బాల్యావస్థకు సంకేతం. తీసుకోవడం- విలువలకు ప్రాతిపదిక, అవసరానికి మించి ఆశించడం సమంజసం కాదు. ఇది యౌవనావస్థకు ప్రతీక. ఉన్నదానిని ఇతరులతో పంచుకుంటే… ఆప్యాయత, ఆదరణ, ఇతరుల ప్రేమను పొందగల అవకాశం ఉంది. ఇది ప్రౌఢత్వానికి చిహ్నం. తనవద్ద ఉన్నది ఉదారంగా ఇవ్వడం.. వివేకం, సమైక్యత, వివేచనను పొందుతాం. ఇది వార్ధక్యాన్ని
సూచిస్తుంది.
ఈ భావనలను యాజమాన్య నిర్వహణకు ప్రతీకగా చెప్పుకొంటే.. ఇవ్వడం తీసుకోవడం సమానమైన అవసరమైన ప్రక్రియలు, ప్రతీ యాజమాన్య విధానం ఇవ్వడం-తీసుకోవడం సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవ్వడమనేది అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించటం/ పంచుకోవడంగా చెప్పుకోవచ్చు. యాజమాన్యంలో ఇది నిర్వహణ, బృందంలో సమతుల్యతను సాధించడం, బృందాన్ని బలోపేతం చేయడంగా చెప్పవచ్చు. ఉద్యోగులకు అవసరమైన వనరులు, సమాజానికి సేవ, కృషి ఫలాలను పంచడం ఇవ్వడంగా భావిస్తాం.
తీసుకోవడం అంటే బాధ్యతాయుతంగా స్వీకరించడం. దాని విలువలను అవగాహన చేసుకోవడం, సమర్థంగా, వ్యర్థపరచకుండా వినియోగించడం. ఇవ్వడం, తీసుకోవడం.. అవగాహన పెంచుకోవడం, విశ్లేషణ చేసుకోవడం.. తిరిగి సమాజానికి ఇవ్వడం.. ఈ ప్రక్రియ పునరావృతం కావడం జరుగుతుంది.
-పాలకుర్తి రామమూర్తి