నలభై ఏళ్ల క్రితం.. అదే కాఠ్మండు వీధుల్లో.. అవే నినాదాలిచ్చిందామె. ప్రజాస్వామ్యం కావాలని, సమానత్వం ఉండాలని, గణతంత్రం రావాలని పోరాడి జైలుపాలైంది. తన స్వప్నం ఫలించి ప్రజాస్వామ్యం సిద్ధించిన వేళ ఆ ఖైదీ… న్యాయమూర్తి అయింది. ఆ తర్వాత దేశ సర్వోన్నత న్యాయమూర్తిగా ఎదిగింది. ఆ ప్రజాస్వామ్యం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిన ఈ సమయాన.. ఆ దేశ ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టింది సుశీల కర్కి. న్యాయవ్యవస్థకే వన్నె తెచ్చిన తీర్పులెన్నో ఇచ్చిన సుశీలకు జనరేషన్ జెడ్ జై కొట్టింది!
భారతదేశ సరిహద్దుకు సమీపంలోని శంకాపూర్ అనే గ్రామంలో సుశీల పుట్టింది. న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆమె భారత దేశానికి వచ్చారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివారు. అదే సమయంలో ఆమెకు నేపాలీ పౌరుడు దుర్గాప్రసాద్ సుబేది పరిచయమయ్యారు. ఆయనకు రాజకీయాలంటే ఇష్టం. అభిరుచులూ కలిసిన వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.
ఇరుగుపొరుగు దేశాల్లో స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాల ప్రేరణతో నేపాల్లో కూడా స్వేచ్ఛాకాంక్ష పెరిగింది. ప్రజాపోరాటానికి రాజు తలవంచక తప్పలేదు. రాజును ఆమోదిస్తూనే ప్రజాస్వామ్యం మొగ్గతొడిగింది. అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. నేపాల్ రాజు ప్రజా ప్రభుత్వాన్ని పక్కనపెట్టి, ‘పంచాయత్’ అనే వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ప్రజలకు ఆ పంచాయత్ పాలకుల పక్షపాతం, అవినీతి శాపాలుగా మరాయి. అప్పటికి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సుశీల.. రాచరిక వ్యతిరేక పోరాటంతో భుజం కలిపింది. దుర్గాప్రసాద్ నేపాలీ కాంగ్రెస్లో సభ్యుడు.
కర్కి కూడా ఆయన బాటలోనే నడిచింది. దుర్గాప్రసాద్ పార్టీ అనుబంధ యువజన విభాగానికి నాయకుడు. 1973లో రాయల్ నేపాల్ ఎయిర్లైన్స్ డీహెచ్సీ-6 విమానాన్ని హైజాక్ చేశాడు. ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటి విమాన హైజాక్గా ఇది చరిత్రకెక్కింది. నేపాల్లో సాయుధ పోరాటాన్ని పునరుద్ధరించి, రాజుని దించాలని పార్టీలన్నీ అనుకున్నాయి. ఆ ఉద్యమానికి కావాల్సిన నిధుల కోసం విమానాన్ని హైజాక్ చేశారు. ఆ విమానంలో బాలీవుడ్ ప్రముఖ నటి మాలాసిన్హా కూడా ఉన్నారట భర్తకు సరిజోడుగా ఉన్న సుశీల ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ కారణంతో ఆమెను జైలులో నిర్భందించారు.
నేపాల్ విప్లవం సఫలమై ప్రజాస్వామ్యం మళ్లీ పురుడు పోసుకుంది. నేపాల్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. సుశీల సాధారణ జీవితం ప్రారంభించారు. మూడు దశాబ్దాలపాటు ఆమె న్యాయ రంగంలో పనిచేశారు. ఓ ఎనిమిదేళ్లు జడ్జిగా సేవలు అందించారు. నేపాల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ దేశ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా గౌరవాన్ని అందుకున్నారు. నిజాయతీగా పనిచేశారు. పాలకులకు ఎన్నడూ భయపడలేదు. పార్టీల విమర్శలకు తలొగ్గలేదు. అవినీతికి లొంగలేదు. ఏనాడూ బంధుప్రీతి చూపలేదు. పదవికే వన్నె తెచ్చిన వ్యక్తిగా పేరు గడించారు. నేపాల్ ప్రజా జీవితాన్ని, పాలనా వ్యవస్థల్ని ప్రభావితం చేసే తీర్పులెన్నో ఇచ్చి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సుశీల.
నేపాల్లో సాకారమైన ప్రజాస్వామ్యం మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆ దేశ గణతంత్ర ప్రజాస్వామ్యానికి పదిహేడు సంవత్సరాలు. నేపాల్ సంపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడినప్పుడు పుట్టిన పిల్లలకు ఈ పాలన నచ్చలేదు. ఊడలుదిగిన పాలకుల్ని, కాకలుతీరిన పార్టీల నేతల్ని తరిమికొట్టారు. అవినీతి, బంధుప్రీతి లేని ప్రజాస్వామ్యం కోసం రాజధానిని ముట్టడించి ప్రజాస్వామ్యం కావాలని ఎలుగెత్తి చాటారు. పాత పాలకులు గద్దె దిగిన వేళ, ‘పాలన గాడిలో పెట్టేందుకు ఎవరు ఉత్తమం?’ అన్న ప్రశ్నకు దేశమంతా బదులిచ్చిన సమాధానం సుశీల కర్కి.
విద్య, వ్యక్తిత్వం, పోరాట జీవితం, న్యాయమూర్తిగా చూపిన తెగువకు దక్కిన గుర్తింపు ఆమె ఎంపిక. నేపాల్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన సుశీల నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా (తాత్కాలిక) బాధ్యతలు చేపట్టి మరోసారి చరిత్ర సృష్టించారు. తాను కలలుగన్న ప్రజాస్వామ్యం విఫలం కానివ్వనని, ఎందరో అమరుల స్వప్నం సాకారం చేస్తానని ప్రధానమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో సుశీల కర్కి ఇచ్చిన మాట రేపటి చరిత్రలో నిజం కావాలని కోరుకుందాం.
తన జైలు జీవితానుభవాన్ని ‘కారా’ పేరుతో సుశీల నేపాలీలో నవలీకరించారు. ఇందులో తన కారాగార జీవితంతోపాటు సమాజంలో బానిసల్లా బతికే స్త్రీల దయనీయ స్థితిని అక్షరీకరించారు. ‘నేపాల్ సమాజానికి ఇది వాస్తవ రూపం’ అని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సపనా మల్లా ‘కారా’ నవలను ప్రశంసించారు.
సుశీల కర్కి ‘న్యాయ’ అనే ఆత్మకథ రాసుకున్నారు. కాలేజీ జీవితం నుంచి వృత్తి జీవితంలో ఎదురైన అనుభవాలను ఈ పుస్తకంలో పంచుకున్నారు. తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లు, తీర్పులకు అనుకూలంగా, వ్యతిరేకంగా రాజకీయ పార్టీల స్పందనల్ని ఈ పుస్తకంలో
పొందుపరిచారు.