జస్టిస్ చంద్రు పాత్రలో నటించాలని సూర్య ఎందుకు అనుకున్నారు? డైరెక్టర్ కథ చెప్పగానే ఆయన ఫీలింగ్ ఏంటి?
jai bhim | ఇది సినిమా మాత్రమే కాదు. అణచివేతకు బలైన వ్యక్తుల కథ. వెలివేతకు గురైన గుంపుల బాధ. ఇందులో నిమ్నకులాల బతుకుపోరాటం ఉంది. న్యాయం కోసం పరితపించే ఆడబిడ్డ ఆత్మగౌరవం ఉంది. సమాజంలో న్యాయం బతికే ఉందన్న ధైర్యాన్ని కేవలం న్యాయస్థానాలు మాత్రమే ఇవ్వగలవని బలంగా నమ్మే న్యాయవాది ఆత్మవిశ్వాసమూ ఉంది. ఆ సమూహాల సమస్యల గురించి, ఆ మగువ పోరాటం గురించి, ఆ యోధుడి పోరాట పటిమ గురించీ ప్రపంచానికంతా తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు ‘జై భీమ్ ( jai bhim )’ చంద్రు పాత్రలో చండ్రనిప్పులు కురిపించిన సూర్య ( suriya ).

నేను ‘జై భీమ్’కు ముందే ఒకసారి జస్టిస్ చంద్రు సర్ని కలిశాను. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన మానవ హక్కుల కేసులకు ఫీజులు తీసుకునేవారు కాదని అప్పుడే తెలిసింది. చాలా
ఆశ్చర్యంగా అనిపించింది. మళ్లీ ‘జై భీమ్’సమయంలో చంద్రు సర్ జీవిత కథను, నిజాయతీని, నిబద్ధతను డైరెక్టర్ జ్ఞానవేల్ వివరించినప్పుడు, ఆయన పట్ల మరింత గౌరవం పెరిగింది. నా పాత్రకు ప్రాణం పోయాలంటే చంద్రు సర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపించింది. లోతుగా అధ్యయనం చేశాను. ఆయన రాసిన పుస్తకాలు చదివాను. చిన్నప్పటి నుంచీ ఆయన అనుభవించిన కష్టాలు విన్నాను. బాధితుల పక్షాన చేసిన పోరాటాల గురించి తెలుసుకున్నాను. ఆ మహావ్యక్తి కథ ప్రపంచంలోని ప్రతి మూలకూ వెళ్లాలని అనిపించింది. ఈ కథలో నేను కాదు.. కథే హీరో. ఆ కథే జస్టిస్ చంద్రు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నేను మొదటిసారి న్యాయవాదిగా నటించిన చిత్రం ఇదే. తమిళ సినిమాల్లో ఈ మధ్య ఒక్క కోర్టు సెట్టింగ్ సీన్ కూడా వేయలేదు. ఈ కథ మాత్రం కోర్టు చుట్టూనే తిరగడం కొత్తగా అనిపించింది. కథ వినగానే.. ఓ కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించు కున్నా. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నా. ఇంతటి స్పందనను ఊహించ లేదు.
గిరిజన యువతి చినతల్లి పాత్ర ఈ సినిమాకు ఆత్మ లాంటిది. ఆ క్యారెక్టర్లో నటి ఒదిగిన తీరు అద్భుతం. కథ ఆసాంతం ఒక గిరిజన మహిళకు న్యాయం ఎలా జరుగుతుందనే ఆలోచన చుట్టే తిరుగుతుంది. పోరాటంతో ఒక వ్యవస్థను ఎలా కదిలించవచ్చో, ఆ వ్యవస్థలో ఎలా మార్పు తీసుకురావచ్చో ఈ సినిమా ద్వారా కండ్లకు కట్టినట్టు చెప్పాం.

కథ వింటున్నప్పుడు నా కంఫర్ట్ జోన్లో లేదనిపించింది. నా మునుపటి చిత్రాలకూ, ‘జై భీమ్’కూ అసలు పోలికే లేదు. జయాపజయాలు పక్కనపెడితే, ఈ చిత్రాన్ని చేయడం నా సామాజిక బాధ్యతగా భావించా. ఇందులో నటీనటులు అద్భుతంగా చేశారు. భావోద్వేగాలు చిరకాలం గుర్తుండిపోతాయి. ప్రతి ప్రేక్షకుడినీ ఈ సినిమా కచ్చితంగా కదిలిస్తుంది, కట్టిపడేస్తుంది, ప్రభావితం చేస్తుంది. నా కెరీర్లో ఈ చిత్రం
చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ సినిమాను ఒప్పుకోవడమే నా సక్సెస్. ఈ చిత్రంలో 1995లో జరిగిన ఒక వాస్తవ సంఘటనను మాత్రమే చెప్పాం. ఇది చంద్రు సర్ సిట్ ద్వారా తీసుకున్న ఒక కేసు మాత్రమే. అందులో న్యాయం ఉంది కాబట్టే, మేం ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. న్యాయ వ్యవస్థ, పోలీసులు కలిసికట్టుగా పనిచేసి బాధితులకు న్యాయం అందించాలని మా సినిమా చెబుతుంది. అంతేకానీ ప్రస్తుత రాజకీయాలకో, ఇంకేవో వర్తమాన పరిణామాలకో అన్వయించుకోవడం సరికాదు.
చంద్రు సర్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయనతో సంభాషిస్తుంటే సమయం తెలిసేది కాదు. కలిసిన ప్రతీసారి కొండంత శక్తి వచ్చినట్టు అనిపించేది. ఏదో ఓ కొత్త సంఘటనను మనతో పంచుకుంటారు. ఒకరోజు ఆయన షూటింగ్ లొకేషన్‌కు వచ్చారు కూడా. మా కోర్టు సన్నివేశాలను చూసి మెచ్చుకున్నారు. కెమెరా ముందు నేను తనలా ఎలా మాట్లాడుతున్నాను, ఎలా వాదిస్తున్నాను.. అన్నది గమనించారు. అదొక గొప్ప అనుభవం నాకు.

వ్యక్తులు అణచివేతకు గురైనప్పుడు చట్టం మాత్రమే వారిని కాపాడుతుందని నేను భావిస్తాను. చినతల్లిలాంటి వారికి చట్టం ద్వారా తప్పితే మరో మార్గంలో న్యాయం దక్కే అవకాశమే లేదు. 200 ఏండ్ల బ్రిటిష్ పాలనలో కేవలం 400 చట్టాలు మాత్రమే ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన డబ్భు అయిదేండ్లలో వేలకొద్దీ చట్టాలు వచ్చాయి. ఎన్ని చట్టాలున్నా, మనం వాటిని ఎంత సమర్థంగా ఉపయోగిస్తున్నాం, ఎలా న్యాయం పొందుతున్నాం అనేది ముఖ్యం. న్యాయవాదుల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఏదో ఓ రూపంలో వారి గురించి తెలుసుకోవడం, మాట్లాడటం, ప్రపంచానికి చాటిచెప్పడం మన కర్తవ్యం, కనీస బాధ్యత.
సామాన్యులకు న్యాయాన్ని చేరవేయడానికి చాలా చట్టాలు ఉన్నాయి. వాటి గురించి ప్రజలకు వివరించడంలో మీడియా గొప్ప పాత్ర పోషిస్తున్నది. అందులో ఓ బలమైన మాధ్యమం సినిమా. నిజానికి, ప్రతి ఒక్కరికీ చాలా విషయాలు తెలుసు. ఈ దేశ పౌరులమైన మనం మెరుగైన సమాజం వైపు పయనించాలి. నిజమైన కథల గురించి మాట్లాడేటప్పుడు, ఒకప్పుడు ప్రజలు ఎలా జీవించారు? అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? తమవాళ్ల కోసం ఎలా నిలబడ్డారు? అనే విషయాలు ప్రస్తావించాలి. దీనివల్ల, గతాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెరుగైన సమాజం వైపు ఎలా పయనించాలన్నది నేటి తరానికి తెలుస్తుంది.
‘అదృష్టం కొద్దీ నా చుట్టూ చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్లంతా నా సొంత పరివారమనే అనుకుంటాను. కాబట్టి నేను నా కుటుంబం, నా వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడూ గొంతెత్తాల్సిన అవసరం రాలేదు. కానీ, ఆపద వచ్చినప్పుడు పిడికిలి బిగించి నినదించడంలో తప్పులేదు. గతంలో నేను నా ఎన్జీఓ కోసం నా అభిప్రాయాలను వినిపించాను. దానికి రాజకీయాలతో సంబంధం లేదు. స్పందించడం, మార్పు కోసం గొంతెత్తడం ఉత్తమ పౌరుడి లక్షణాలు. జై భీమ్!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
Lawrence: జై భీమ్ చూసి చలించిపోయిన లారెన్స్.. ఇల్లు కట్టిస్తానని హామీ
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
jai bhim : ఈ సినిమా వెనుకున్న అసలు హీరో ఎవరంటే..?
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- jai bhim
- lijomol jose
- Pintop
- suriya
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

