‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
“మీరెన్నన్నా అనండి! కానీ, పాపం నోరులేని ఆ జీవాలను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను! అది మామయ్యే కానీ.. మీరే కానీ!”.
“అదికాదే! మొన్ననే కదా అమ్మ చనిపోయింది. అమ్మతో నాన్నకు ఎంతలేదన్నా యాభై ఏళ్ల అనుబంధం. అలాంటిది.. అంత బాధలో ఉన్న ఆయన మనసు బాలేక ఏమైనా అన్నా నువ్వు ఊర్కో.. ఏమీ అనకు”.
“అరె! నేనేమన్నానని?.. ‘మీరు మమ్మల్ని ఏమైనా అనండి మామయ్యగారు! కానీ, నోరులేని ఈ మూగజీవాలను మాత్రం ఏమీ అనకండి’ అన్నాను. అంతే కదా! అయినా నాకు మాత్రం అత్తయ్యను కోల్పోయి ఆయన బాధలో ఉన్నాడని తెలీదా ఏం? అందుకే కదా.. అత్తయ్య కార్యక్రమాలన్నీ కాగానే.. గుళ్లో, వాళ్ల అత్తగారింట్లో నిద్ర అయ్యాక, ముందుగా మనమే మన ఇంటికి తీసుకొద్దామని అన్నది”.
“నిజమే మధూ! నేను కాదన్నానా? ఆయన మనసు చాలా సున్నితం. మొదటినుంచీ మా అమ్మకూడా ఆయన్ని అలాగే చూసుకుంది. ఏదో ఆయన మన టామీని పట్టుకుని.. ‘ఛీ! వెధవ సంత’ అన్నాడే అనుకో.. దానికి వెంటనే ఆయన మొహంపై కొట్టినట్లు అలా.. ‘మామయ్యా! నన్నేమైనా అనండి కానీ, వాటిని ఏమైనా అంటే నేను ఊరుకోను’ అంటూ అల్టిమేటం ఇవ్వాలా?.. ‘ఏదో నోరులేని జంతువు కదా మామయ్యా! ఇంత పడేసినా జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది’ అంటూ సున్నితంగా మాట్లాడితే అయిపోయేది కదా అనీ!”.
“ఛీ! ఛీ! వెధవ బతుకు! ఈ ఇంట్లో ఎంత చేసినా ఇంతే! ఆయన బాధలో ఉన్నాడని నేనెంత మంచిగా చూసుకుంటున్నాను. అదేం కనిపించదు మీకు. ఒక్కమాట కొంచెం కటువుగా అన్నదే కనిపిస్తుంది. పొద్దున లేవగానే ఎప్పటిలా హడావుడి అయినా.. గుర్తుపెట్టుకుని ఆయనకు కాఫీ కలుపుతున్నానా? మళ్లీ వేడివేడిగా టిఫిన్ చేసి.. ‘తినండి మామయ్య గారూ!’ అంటున్నానా? ‘మీకు ఏ కూరలు ఇష్టమో చెప్పండి.. అవే వండుతాను’ అంటూ అడుగుతున్నానా? ఇలా ఎప్పటికీ ఆయన బాగోగులు చూస్తూనే ఉన్నాను కదా! ఏ కోడలైనా ఇంతకన్నా బాగా చేస్తుందా?”.. ముక్కు చీదింది మాధవి.
“అబ్బా! నీకో నమస్కారం తల్లీ! కుళాయి కట్టేయి. పొరపాటున అన్నాలే కానీ. ఇక ఊర్కో!”.
“అదిగో! ఎంత వెటకారమో! అప్పటికీ అందరూ మంచివాళ్లు.. నేనే ఏదో రాద్ధాంతం చేస్తున్నట్లు!”.. ఇంకా ఏదో అనబోతుంటే, అప్పటికే వాకింగ్ నుంచి ఇంట్లో అడుగుపెట్టి, అంతా విన్న సీతారామయ్య.. ఆ వివాదం తప్పించడానికి, దగ్గుతూ తన ఉనికి తెలియజేస్తూ..
“ఏంట్రా! ఏంటీ గొడవ?” అన్నాడు.
“అబ్బే! ఏంలేదు నాన్నా! మన టామీకి ఆరోగ్యం బాలేదట. ‘ఈవేళ సాయంత్రం త్వరగా రండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అలానే రేష్మీని కూడా చెకప్ చేయించినట్లు ఉంటుంది’ అంటున్నది మధు”.
టామీ, రేష్మీ.. రెండూ వాళ్లు పెంచుకునే కుక్కలు.
“కాసిన్ని మంచినీళ్లు వేడిచేసి ఇవ్వరా నాన్నా!” దగ్గుతూ అన్నాడు సీతారామయ్య.
“ఏమయ్యింది నాన్నా! దగ్గుతున్నారు?”.
“నిన్నటినుంచి కొంచెం బాలేదురా. చల్లగాలిలో నడిచినందుకేమో జలుబు, దగ్గు”.
“అయ్యో! అలాగా నాన్నా! కాస్తంత ఎండ వచ్చాక వాకింగ్‌కు వెళ్లు. చెవుల చుట్టూ మఫ్లర్ చుట్టుకో! ఆగు నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి వేసుకుని టీ తాగు నాన్నా!”.
“బీపీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి రా! అలాగే జండూబామ్ లేకపొతే రోజు గడవదు”.
“అలాగే లే నాన్నా! ఈవేళ ఆఫీసు నుంచి వచ్చేప్పుడు తెస్తాలే! మరి వెళ్లొస్తాను”.
“ఏమండీ! అలాగే మన టామీ బిస్కెట్లు.. దాని టానిక్ అయిపోయింది. వచ్చేప్పుడు తెండి!”.
“అలాగే!”.. అంటూ వెళ్లిపోయాడు
రామకృష్ణ.
సాయంత్రం వస్తూనే..
“త్వరగా టామీని, రేష్మీని తీసుకుని వచ్చేయి మధూ! లేటయితే డాక్టర్ వెళ్లిపోతాడు”.. అంటూ తొందరపెట్టగానే, ఉన్నపళాన టామీ, రేష్మీతో కారెక్కేసింది మాధవి. వచ్చేసరికి చాలా పొద్దు
పోయింది.
ఆ తెల్లవారి రెండో కొడుకు రాఘవ వచ్చి రమ్మనగానే.. ఆయనకున్న ఆస్తి అయిన బట్టలు, మందుగోళీలు అన్నీ సర్దుకుని రాఘవతో బయల్దేరాడు సీతారామయ్య.
* * *
“భౌ! భౌ!”..
గేటు తెరవడంతోనే గయ్యిమంటూ మీదికొచ్చిన కుక్కను చూసేసరికి.. సీతారామయ్య పై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే భయంతో రాఘవ వెనక్కి
వచ్చేశాడు.
“హే స్వీటీ! యూ నాటీ! గో ఇన్సైడ్.. అదేమనదు నాన్నా!”.. నవ్వుతూ అంటూ, తండ్రి చేయి పట్టుకుని లోపలికి నడిపించుకెళ్లాడు. కోడలు పలకరించి మంచినీళ్లు అందించింది. తాగుతూ ఉంటే.. ఎదురుగా కనిపించిన రెండు అల్మారాలలో ఉన్న మందులను చూసి ఆశ్చర్యపోయాడు.
“ఏమిట్రా ఇవి! ఇన్ని మందులు ఏంటి?” అడిగాడు కొడుకును.
“అయ్యో నాన్నా! కంగారు పడకు. అవి మావికావు. మన స్వీటీవి. ఇటీవల దానికి ఆరోగ్యం బాగా ఖరాబైందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. అప్పుడు కొన్నవి. అంతకుముందువి. దాని ఆహారం, బిస్కెట్లు వగైరా అన్నమాట! ఆ డబ్బాలపై రాసి ఉంది చదువు” అన్నాడు.
“కళ్లద్దాలు అంతగా అగుపడటం లేదురా! అక్కడ అన్నయ్యతో అన్నా గానీ.. పాపం వాడికి తీరలేదు”.
“ఇక్కడ ఒకసారి వెళ్దాంలే నాన్నా!”.
“షుగర్, బీపీకూడా చెక్ చేయించుకుని చాలా రోజులయ్యింది రా!”.
“వీలు చూసుకుని ఒకరోజు వెళ్దాంలే నాన్నా!”.. అంటూ హడావుడిగా బయటికి వెళ్లిపోయాడు.
“మామయ్యా! స్వీటీకి ఇవ్వాళ ఆలస్యం అయిందని ఒకటే గునుస్తుంది. పిచ్చిముండ! దానికి కొన్ని పాలు, బిస్కెట్స్ వేసి.. మీకు టిఫిన్ తెస్తాను. టీవీ చూస్తుండండి మామయ్యా!..” అంటూ లోనికెళ్లింది కోడలు శ్రావణి.
ఉదయం తొమ్మిదే అయినా.. లోపల ఆకలి నకనకలాడుతున్నది. అదే తన స్వరాజ్యం ఉంటేనా!
‘అసలే షుగర్! ఇంతసేపు ఎలా ఉంటారు?’ అంటూ ముందు ఏదో ఒకటి తినడానికి ఇస్తుంది. ఆమెకు పూజలో ఆలస్యమైనా తనే వంట గదిలోకి వెళ్లేవాడు. తనకోసం ఇలా అర్జెంట్‌గా పనికొస్తాయని, ఎక్కువ నూనెలేని వస్తువులు, అటుకుల చుడువా, పేలాలు, మొలకలు లాంటివేవో సిద్ధంగా ఉంచేది. ఇప్పుడు అలా వంటింట్లోకి చొరవగా వెళ్లలేడు. అలా అని.. నోరు తెరిచి చనువుగా ఆకలంటూ అడగనూ లేడు.
తన భార్యను తలుచుకొంటూ..
ఉస్సురని నిట్టూర్చాడు.
అరగంటలో ఉప్మా తీసుకొచ్చింది శ్రావణి. అది చూడగానే నీరసం ముంచుకొచ్చింది ఆయనకు. నిజానికి ఆయనకు మొదటినుంచీ ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. భార్యకు ఆయన ఇష్టాయిష్టాలు తెలుసు కాబట్టి.. ఎప్పుడూ ఉప్మా పెట్టేది కాదు. కానీ, ఇప్పుడు ఆమెలేని తాను ఏకాకి అయ్యాడు. ఆత్మీయులందరూ ఉన్నా.. ఎవరూ లేని ఒంటరిలా మిగిలాడు. భార్య గుర్తుకురాగానే కళ్లు చెమర్చాయి ఆయనకు.
ఇక్కడ రాఘవ, శ్రావణి ఇద్దరూ బిజీగానే ఉంటారు. ఇద్దరు పిల్లలు. వాళ్లూ.. పెద్దబ్బాయి పిల్లల్లాగే పొద్దున స్కూల్, సాయంత్రం ట్యూషన్, సంగీతం క్లాసులతో బిజీగానే ఉంటారు. ఖాళీగా ఉండేది సీతారామయ్య మాత్రమే. పొద్దున లేవగానే రాఘవ కుక్కను పట్టుకుని అలా కాలనీలో కాలకృత్యాలకు తీసు
కెళ్తాడు. ఒక్కోసారి అరగంట పైనే అవుతుంది. రాగానే ఫోన్లు అటెండ్ అవుతూ, ఆఫీసుకు తయారయ్యే బిజీలో ఉంటాడు. కోడలు శ్రావణి పనిమనిషికి పనులు పురమాయిస్తూ, వంట చేస్తూ.. బిజీగా ఉంటుంది.
పొద్దునే అలా పెరట్లోకెళ్లి మొక్కలను పరామర్శిస్తూ, అవి తలలూపుతూ పలికే స్వాగతాన్ని ఆస్వాదిస్తూ, అర్ధాంగితో చెప్పాలని అనుకున్నవన్నీ వాటితో పంచుకుంటూ.. కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు సీతారామయ్య. కళ్లద్దాలు ఇంకా మార్చకపోవడంతో తనకు ఇష్టమైన.. ‘చదవడం’ అనే వ్యాసంగాన్ని కొనసాగించలేక పోతున్నాడు. పొద్దున మొక్కలతో ముచ్చట్లు అయిపోయాక.. స్నానం, పూజ ముగించుకునేసరికి కాఫీ, టిఫిన్ సిద్ధంగా ఉంటుంది.
ఆయనకు ముందునుంచే కుక్కలంటే చాలా భయం. చాలా ఏళ్లకింద ఒకసారి కుక్క కరిస్తే.. ఆయనపడ్డ నరకం అంతా ఇంతా కాదు. ఆ ఇంజక్షన్ల బాధ ఒకెత్తయితే.. పథ్యం అంటూ కడుపు మాడ్చుకోవడం, పొరపాటున ఏ రేబిస్ వ్యాధో వస్తుందని భయపడి చావడం.. ఇదంతా మరో ఎత్తు. ఆ భయానికి తగ్గట్లు కొడుకులిద్దరి ఇళ్లలో కుక్కలు ఉండటం ఆయనకింకా చిరాకు తెప్పించింది. అందుకే చిన్నవాడు రమణ వచ్చి, తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పగానే ఆనందంగా బయల్దేరాడు.
* * *
ఇంటికి వెళ్లిన ఆయనను కోడలు, మనవళ్లు ఆప్యాయంగా పలకరించారు. అయితే ఒకరోజు పొద్దునే మనవడు అన్న మాటలు.. ఆయనకు పక్కన బాంబు పడ్డట్లు ఉలిక్కిపడేలా చేశాయి. ఇంతకీ మనవడు హర్ష ఏమన్నాడంటే..
“నాన్నా! మరే.. పెద్దనాన్నల అందరి ఇళ్లలో ఎంచక్కా మంచి మంచి కుక్కలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా ఉన్నాయి. మనంకూడా ఓ కుక్కను పెంచుకుందాం నాన్నా!” అని.
“అవునండీ! ఇప్పుడు అది మంచి స్టేటస్ సింబల్ కూడా! అంతేనా! ఇవ్వాళ రేపు దొంగల బెడద కూడా ఉంది కదా! అది ఇంట్లో ఉంటే.. ఏ భయమూ ఉండదు” అన్నది చిన్న కోడలు.
“అలాగే తెచ్చుకుందాం లెద్దూ!”.. అన్న చిన్న కొడుకు మాటలతో ఉలిక్కిపడి..
“వద్దు! వద్దేవద్దు..” గట్టిగా అన్నాడు
సీతారామయ్య.
“ఏం నాన్నా? ఎందుకు వద్దు?” అన్నాడు చిన్నోడు. ఆయనేమీ మాట్లాడలేదు.
“తాతయ్యా! చాలా బావుంటుంది కదా! నీతో ఎంచక్కా వాకింగ్‌కి కూడా వస్తుంది. ఎందుకు వద్దంటున్నావు?”.. ఒకింత సందేహంగానే అడిగాడు మనవడు.
మౌనం వహించాడు ఆయన. అప్పటికి ఎవరో రావడంతో ఆ ప్రసక్తి అక్కడితోనే ఆగి
పోయింది.
* * *
“నాన్నా! నీతో ఎన్నిసార్లు అన్నాను.. కుక్కను పెంచుకుందామని. ఆ బన్నీగాడు! పేద్ద.. తనకే ఆల్సేషన్ డాగ్ ఉన్నట్లు నా వంక చూస్తూ, వాడి కుక్కతో ఆటలు ఆడుతూ, నాపైకి ఉసిగొలిపి నవ్వుతున్నాడు. వాడి పొగరు అణచాల్సిందే! ఈ రోజు నువ్వు కుక్కను తీసుకురాకపోతే నేను అన్నం ముట్టను అంతే!”..
మనవడి అలకతో గుండెల్లో రాయి పడ్డట్లు అయ్యింది సీతారామయ్యకు.
“వద్దు! ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దు..” తనకు తెలియకుండానే వణుకుతున్న గొంతుతో గట్టిగా అరిచాడు మళ్లీ.
ఉలిక్కిపడ్డాడు రమణ. తండ్రిలో ఇంతటి భయం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు అతను.
“పిల్లవాడు ఏదో సంబరపడుతున్నాడు. పోనీ లే నాన్నా! నువ్వెందుకు అంతగా ‘వద్దు’ అంటున్నావు?” అన్నాడు రమణ.
మౌనంగా ఉన్న ఆయన్ను చూసి..
“పోనీలే నాన్నా.. వాడి సంతోషం కోసం కొన్నిరోజులు ఉంచుకుని పంపుదాం లెద్దూ!” అన్నాడు మళ్లీ తనే.
“వద్దు. వద్దంటే వద్దు! ఒకవేళ తీసుకురావాలని అనుకుంటే.. నేను ఇక్కడ ఉండను. వృద్ధాశ్రమానికి వెళ్తాను” గంభీరంగా, స్థిరంగా అన్నాడు.
నివ్వెరపోయాడు రమణ. వెంటనే లేచి..
“అదేంటి నాన్నా! అంతమాట అన్నావు. ఎందుకో చెప్పు నాన్నా!” అన్నాడు తండ్రి దగ్గరికి వచ్చి, ఆయన చేయిని తన చేతిలోకి తీసుకుంటూ.
కోడలు, మనవళ్లు కూడా అదే అడిగారు.. రెట్టిస్తూ!
“ఎందుకంటే.. ఎందుకంటే.. వాటిని చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుంది కాబట్టి!”.
“ఏంటీ?”.. అంతా ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు. వాళ్లకు ఆయన అన్నది అర్థం కాలేదు.
“అసలు వాటిని చూస్తే నీకు అసూయ ఎందుకు నాన్నా? పాపం నోరులేని జీవాలు. ఏదో మిగిలింది ఇంతపెడితే ఎంతో విశ్వాసంగా జీవితాంతం పడి ఉంటాయి. వాటిపై అంత కోపం ఎందుకు నాన్నా? నువ్వే చిన్నప్పటి నుంచి మూగజీవాల పట్ల దయతో ఉండాలని చెప్పావు కదా! చెప్పు నాన్నా..” రెట్టించాడు రమణ.
“ఎందుకంటే.. అవి నన్ను చూసి వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది!”.
“అవి వెక్కిరించడం ఏంటి నాన్నా?”.
“పొద్దున్నే వాటిని కాలకృత్యాలకు తీసుకెళ్తారు. కనీసం వాటితో గడిపే ఆ అరగంటైనా నాతో గడపడానికి ఇష్టపడరు. వాటి ఆహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
ప్రతిరోజూ సమయం ప్రకారం వాటికి పాలు, తినుబండారాలు.. క్రమం తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మూగజీవి.. అడగలేదు కాబట్టి. నాకు మాత్రం ఆకలి నకనకలాడుతున్నా, నోరున్నా అడగలేను. దానికి ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ, అదే నాకు ఆరోగ్యం బాగాలేక పోతే మాత్రం పట్టించుకోరు. బీపీ, షుగర్ ఉన్నప్పటికీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా, ఇంట్లో ఉన్న ఏవో మందులు వేసుకోమంటారు.
ఎందుకంటే.. అందుకు మీ దగ్గర సమయం ఉండదు. ఆహారం దగ్గర.. దానికి పాటించే సమయపాలన నాకు ఉండదు. దానిని హాస్పిటల్‌కి తీసుకెళ్తూ.. అదే దారిలో నన్ను కూడా హాస్పిటల్లో చూపించవచ్చు. కానీ, మీకెవరికీ ఆ విషయమే అర్థంకాదు. దానికి ఆహారం అయిపోయినా, మందులు కావాల్సి వచ్చినా.. గుర్తు పెట్టుకుని తెస్తారు.
నాకు ట్యాబ్లెట్లు అయిపోయినా, కళ్లద్దాలు విరిగిపోయినా, ఏవి ఎంత అత్యవసరం అయినా.. నేను చెప్పినవి ఏవీ మీకు గుర్తుండవు. కనీసం కుక్కకు ఇచ్చే గౌరవం కూడా నాకు ఇవ్వడం లేదని, అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది నేను భరించలేను!” ఏడుస్తూ అంటున్న ఆయనను.. అక్కున చేర్చుకున్నాడు చిన్నోడు కూడా ఏడుస్తూ!
నామని సుజనాదేవి స్వస్థలం హనుమకొండ. ఎంఏ (తెలుగు) చేశారు. భారతీయ జీవిత బీమా సంస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో ఉన్నారు. ఇప్పటివరకు 250కి పైగా కథలు, 125పైగా కవితలు, 3 నవలలు రాశారు. 4 కథా సంపుటాలు, 2 కవితా సంపుటాలు వెలువరించారు. మొదటి కథ ‘ప్రేమ తపన’. 1991లో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథకు ఎంతోమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వందకు పైగా పురస్కారాలు, నగదు బహుమతులు, సన్మానాలు పొందారు. అనేక కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. ‘స్పందించే హృదయం’ కథా సంపుటికి.. ఇప్పటివరకు ఆరు జాతీయ పురస్కారాలు వచ్చాయి. దాదాపు అన్ని ప్రముఖ పత్రికల్లో కథలు ప్రచురితమయ్యాయి.
-నామని సుజనాదేవి, 77993 05575