టెన్నిస్ కోర్టులోకి ఓ తెలుగు రాకెట్ రయ్‌మంటూ దూసుకు వచ్చింది. ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. తన సహజమైన ఆటతీరుతో సత్తాచాటుతున్నది. ఆర్థికంగా అంతగా లేకున్నా.. పట్టుదలతో అమెరికాలో ఉచిత కోచింగ్ అవకాశం పొందింది. ఖండాంతరాలు దాటి ఆటపై పట్టుసాధించిన మన తెలుగు తేజం సహజ యామలపల్లి. టెన్నిస్‌లో తండ్రి దగ్గర ఓనమాలుదిద్దిన ఆమె ఇప్పుడు భారత్ టాప్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి. దేశ, విదేశాల్లో ఎన్నెన్నో పతకాలు సాధించి శభాష్ అనిపించుకుంది. తన లక్ష్యం సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టడమే అంటున్న సహజను ‘జిందగీ’ పలకరించింది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే..
Sahaja Yamalapalli | చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. నాన్నతో కలిసి ఇంట్లోనే టేబుల్ టెన్నిస్, మరికొన్ని చిన్నచిన్న ఆటలు ఆడేదాన్ని. మా నాన్న భవానీకుమార్ బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివి ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పనిచేసేవారు. ఉద్యోగం చేస్తూనే ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ చదివాడు. తనకు టీచింగ్ అంటే ఇష్టం. కండక్టర్ ఉద్యోగం వదిలిపెట్టి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడు. మా ఫ్యామిలీ ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు మారింది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉండేవాళ్లం. మా ఇంటికి దగ్గర్లోని సరూర్‌నగర్ స్టేడియానికి తీసుకెళ్లి, ‘ఇక్కడ ఏదో ఒక ఆట నేర్చుకోమ’ని నాన్న చెప్పాడు. అప్పుడు నాకు పదేండ్లు. ఆ స్టేడియం గేటు దాటి లోపలికి అడుగుపెట్టగానే టెన్నిస్ కోర్ట్ కనిపించింది. అక్కడ అమ్మాయిలు ఆడుతున్నారు. బాస్కెట్ నిండా బాల్స్ ఉన్నాయి. వాటిని చూడగానే ముచ్చటేసింది. ఆ బాల్స్ కోసమే టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టా.
నేనూ, నాన్న రోజూ స్టేడియానికి వెళ్లి ఓ గంటపాటు టెన్నిస్ ఆడేవాళ్లం. కోచ్‌కి డబ్బులు ఇచ్చి నేర్చుకునేంత స్తోమత లేదు. టెన్నిస్ కోర్ట్ ఫీజే చాలా ఎక్కువ! అందుకే నాన్నే నా కోచ్ అయ్యాడు. తను యూట్యూబ్ వీడియోలు చూసి, బేసిక్స్ నేర్పించాడు. కొంతకాలానికి తక్కువ ఫీజు తీసుకునే కోచ్‌ల దగ్గర శిక్షణ తీసుకున్నాను. మా బంధువులేమో.. ‘ఆడపిల్లకు ఇవన్నీ ఎందుకు?’ అనేవాళ్లు. ‘మనిషికి ఏదో ఒక ఇష్టం ఉండాలి. అందులో అందరికన్నా ముందుండటానికి ప్రయత్నించాల’ని నాన్న చెబుతుండేవాడు. అలా నన్ను ఆటలవైపు నడిపించాడు. అమ్మ (సుప్రియ)కు ఆటల గురించి అంతగా తెలియదు. నాన్న చెప్పాడు కాబట్టి నమ్మింది. నా కోసం మంచి ఆహారం వండేది. నా సమయాన్ని బట్టి తన పనులు మార్చుకునేది.
గొప్ప ప్లేయర్ అవ్వాలనే కోరిక ఉంది. కానీ, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్‌తో ప్రాక్టీస్ లేదు. పదో తరగతి పూర్తయ్యాక మంచి కోచ్ కావాలని సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ దగ్గర సిన్నెట్ అకాడమీకి వెళ్లాను. అక్కడి కోచ్‌లు రవిచందర్ రావు, ప్రహ్లాద్‌కుమార్ జైన్‌తో మాట్లాడాను. ‘దిల్సుఖ్నగర్ నుంచి ఎలా వస్తావు?’ అని రవిచంద్రరావు సార్ అన్నారు. బస్సులో వస్తానంటే.. ‘వారం రోజుల్లో మానేస్తావ’ని అన్నారు. రెగ్యులర్‌గా వస్తుందని నాన్న బతిమాలి అక్కడ చేర్పించాడు.
టెన్నిస్ బాగా ఆడాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం. ఎల్బీ స్టేడియంలో భాస్కర్ రెడ్డి గారు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతిరోజూ ఉదయం అయిదు గంటలకే నిద్ర లేచి ఎల్బీ స్టేడియానికి వెళ్లేదాన్ని. వర్కవుట్స్ తర్వాత ఏడున్నరకు అక్కడ బస్సు ఎక్కి ప్యారడైజ్‌కు చేరుకునేదాన్ని. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు టెన్నిస్ ప్రాక్టీస్ ఉండేది. ఆ తర్వాత మళ్లీ దిల్‌సుఖ్‌నగర్‌కు ప్రయాణం. నేను వెళ్లేసరికి అమ్మ నా కోసం బస్టాండ్‌లో ఎదురుచూస్తూ ఉండేది. అప్పటికే పన్నెండు గంటలయ్యేది. అమ్మ తెచ్చిన లంచ్ బాక్స్, డ్రెస్ తీసుకొని కాలేజీకి వెళ్లేదాన్ని.
కాలేజీలో డ్రెస్ మార్చుకొని క్లాసులో కూర్చునేదాన్ని. నా పట్టుదల చూసి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్ ప్రోత్సహించింది. అటెండెన్స్‌కి మినహాయింపు ఇచ్చింది. ఇలా రెండేండ్లు గడిచాయి. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించే ఉమెన్స్ టోర్నమెంట్ గెలిచాను. తర్వాత ఐటా ఉమెన్స్ టోర్నమెంట్లలో ఆరు టైటిల్స్ గెలిచాను. ఇండియాలో 20వ ర్యాంక్‌కి చేరుకున్నాను.
ఇంటర్ అయిపోయాక, చదువుపై శ్రద్ధ చూపాలా, టెన్నిస్ కొనసాగించాలా? అన్న సందేహం మొదలైంది. ఆ సమయంలో అమెరికాలోని యూనివర్సిటీల్లో టెన్నిస్ టీమ్ కోసం ప్లేయర్స్‌కి అడ్మిషన్స్ ఇస్తారని ఒకరు చెప్పారు. ఎంపికైతే అన్ని ఫీజులు, ఖర్చులు వాళ్లే భరిస్తారని, టెన్నిస్‌లో ఉచిత శిక్షణ లభిస్తుందని దరఖాస్తు చేయాలనుకున్నాను. అశ్విన్ విజయరాఘవన్ అనే కన్సల్టెంట్‌ని కలిశాను. నా ఆటను వీడియో తీసి అమెరికన్ యూనివర్సిటీలకు పంపించారు. సామ్ హ్యూస్టన్ స్టేట్ యూనివర్సిటీ కోచ్ ఫోన్లో మాట్లాడారు. నేను ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్‌లో ఆడలేదని అడ్మిషన్ ఇవ్వలేదు. కానీ, ‘రెండు నెలల్లో ఐటీఎఫ్ టోర్నమెంట్లో ఆడి నీ ప్రతిభ నిరూపించుకో’ అన్నారు. అప్పుడే చెన్నైలో ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నమెంట్ జరుగుతున్నది. అందులో క్వాలిఫై అయ్యాక.. ఫస్ట్ రౌండ్లో టాప్ ర్యాంకర్‌తో తలపడాల్సి వచ్చింది. క్లోజ్‌గా ఆడి ఓడిపోయాను. ఇంకో జూనియర్స్ టోర్నమెంట్లో సెకండ్ రౌండ్లో ఓడిపోయాను. అయితే, నా ఆట వాళ్లకు నచ్చింది. సామ్ హ్యూస్టన్ యూనివర్సిటీ బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) అడ్మిషన్‌కి అంగీకరించింది. నాన్న స్నేహితులు తలా కొంత డబ్బులు వేసుకొని నా అమెరికా ప్రయాణానికి సాయం చేశారు. అలా టెన్నిస్ కోసం అమెరికాలో అడుగుపెట్టాను.
అమెరికా వెళ్లినప్పుడు యూనివర్సల్ టెన్నిస్ రేటింగ్ (యూటీఆర్) 8 మాత్రమే. ఇది బిలో యావరేజ్ ప్లేయర్ రేటింగ్. నా కోచ్ నన్ను బాగా ప్రోత్సహించారు. మంచి ప్రాక్టీస్ లభించింది. రెండేండ్లలో యూటీఆర్ 10 పాయింట్లకు పెరిగింది. చాలా వేగంగా మెరుగుపడ్డాను. మూడో ఏడాది నాటికి కాలేజీ పోటీల్లో ఓటమి ఎరుగని క్రీడాకారిణిగా ఎదిగాను. అప్పుడు నేను ఆటలో నిలబడగలననే ధైర్యం వచ్చింది. ఆ తర్వాత యూనివర్సిటీలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు వచ్చాయి. 2021 మేలో గ్రాడ్యుయేషన్ పూర్తయింది. ఫుల్‌టైమ్ టెన్నిస్ ఆడాలని డిసైడ్ అయ్యాను. కానీ, ఇది ఖరీదైన ఆట. ప్రయాణాలకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంత డబ్బు సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ప్రహ్లాద్ కుమార్ జైన్ సార్‌కి ఫోన్ చేస్తే.. సపోర్ట్ చేస్తానన్నారు. అప్పటికి ఇంకా నేను అమెరికాలోనే ఉన్నాను. ఆయన ఇచ్చిన డబ్బులతోనే పలు టోర్నమెంట్స్‌లో పాల్గొన్నాను. క్వాలిఫై అవడం, ఒకటి, రెండు రౌండ్లలో ఓడిపోవడం జరిగేది. వరల్డ్ టెన్నిస్ ర్యాంకులలో నాకు 1100 ర్యాంక్ వచ్చింది. అక్కడ వర్కవుట్ అయ్యేట్టు లేదని ఇండియా వచ్చాను.
మళ్లీ నాన్నతో ఆడటం స్టార్ట్ చేశాను. ఐటీఎఫ్ 15 డాలర్స్ టోర్నమెంట్స్ ఆడాను. మూడు వారాలు నా పెర్ఫార్మెన్స్ మామూలుగానే ఉంది. నాలుగో టోర్నమెంట్లో విజృంభించాను. చివరికి టైటిల్ గెలిచాను. ఆ గెలుపుతో ప్రపంచ ర్యాకింగ్స్లో 900కి చేరాను. బెంగళూరులో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అకాడమీలో చేరాను. అక్కడ అమెరికన్ కోచ్ ఉన్నారు. నా ఆటతీరు నచ్చి ఏడాదిపాటూ ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ ఏడాదిలో నాలుగు వందల ర్యాంక్‌కి చేరుకున్నాను. ఐటీఎఫ్ టైటిల్ ఒకటి గెలిచాను. అదే ఏడాదిలో ఇండియా ర్యాంకింగ్స్‌లో నంబర్ త్రీకి వచ్చాను. మళ్లీ అమెరికాలో అడుగుపెట్టాను. ఐటీఎఫ్ 1500 డాలర్స్ టోర్నమెంట్ గెలిచాను. సానియా మీర్జా, కర్మాన్‌కౌర్ తర్వాత ఈ టైటిల్ గెలిచిన మూడో భారత టెన్నిస్ క్రీడాకారిణి నేనే! నా వరల్డ్ ర్యాంక్ 298కి మారింది. ఇప్పుడు ఇండియన్ నంబర్ వన్ ర్యాంకర్‌ని. మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌స్లామ్‌లో ఆడబోతున్నా. సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్నది నా లక్ష్యం! ఆ కల త్వరలోనే నెరవేరుతుంది.
– నాగవర్ధన్ రాయల