స్కిడ్ గేమ్: 2
నెట్‌ఫ్లిక్స్ : డిసెంబర్ 26
తారాగణం : లీ జంగ్ జే, వై హా జూన్, లీ బైంగ్ హున్ తదితరులు
దర్శకత్వం : హ్వాంగ్ డాంగ్ హ్యుక్
‘కొరియన్’ చిత్రసీమ విభిన్నమైనది. ఇక్కడినుంచి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేకశైలి కనిపిస్తుంది. కొన్నేళ్ల కింద వచ్చిన ‘పారసైట్’ చిత్రం.. నాలుగు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడేళ్ల కింద రిలీజైన ‘స్కిడ్ గేమ్’ వెబ్‌సిరీస్ కూడా.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. క్షణక్షణానికీ ఉత్కంఠ రేపుతూ సాగిన ఆ సిరీస్‌కు.. సీక్వెల్‌గా వచ్చిందే స్కిడ్ గేమ్: 2.
క్రైమ్, సర్వైకల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిన్నపిల్లల ఆటల నేపథ్యంతో ‘స్కిడ్ గేమ్’ సాగుతుంది. భారీగా అప్పుల పాలై.. జీవితం మీదే ఆశలు కోల్పోయిన కొందరిని ఓ రహస్య దీవిలోకి చేర్చి.. పిల్లల ఆటల పేరుతో ప్రమాదకరమైన గేమ్స్ ఆడిస్తుంటారు కొందరు. ఆయా ఆటల్లో ఓడిన వారి ప్రాణాలు తీసి వినోదం చూస్తుంటారు. అవి మామూలు ఆటలే అనుకుని ఆడటం మొదలుపెట్టిన 456 మందిలో అందరూ చనిపోతారు. చివరికి సియాంగ్ జీ హున్ (లీ జంగ్ జే) ‘స్కిడ్ గేమ్’లో అన్ని దశలనూ పూర్తిచేసి.. దాదాపు రూ.265 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంటాడు. కానీ, ఆ ఆట అతనిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మనుషుల్నే పావులుగా వాడుతూ.. ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తున్న వ్యక్తిని కనిపెట్టి, ఈ డేంజర్ గేమ్‌ను ఆపి తీరాలని నిర్ణయించుకుంటాడు. తాను గెలుచుకున్న డబ్బుతోనే.. ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? వందల కోట్లు గెలుచుకున్న సియాంగ్.. మళ్లీ ‘స్కిడ్ గేమ్’లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మరోసారి అతను బతికి బయటపడ్డాడా? ప్రమాదకర గేమ్స్ ఆడిస్తున్న నిర్వాహకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తెలియాలంటే.. ‘స్కిడ్ గేమ్ : 2’ను చూడాల్సిందే!