నమస్తే మేడం నా వయసు 43 సంవత్సరాలు. 15, 13 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. రెండు కాన్పులూ సిజేరియన్లే. నెలసరి అయ్యాక 10,11 రోజుల్లో స్పాటింగ్ కనబడుతున్నది. డాక్టర్ని సంప్రదిస్తే పాప్స్మియర్ చేశారు. అది నెగెటివ్ వచ్చింది. ఇబ్బందేమీ లేదన్నారు. అయితే స్పాటింగ్ మాత్రం అలాగే అవుతున్నది. నిజంగానే ఇది ఏమీ ఇబ్బంది కాదా? ఎందుకిలా జరుగుతుంది. నెలసరి అయిపోయిన తర్వాత స్పాటింగ్ కనిపించడం అన్నది చాలా కారణాల మీద ఆధారపడుతుంది. అందుట్లోనూ మీ వయసు 40 దాటింది కాబట్టి, నెలసరి విషయంలో మార్పులూ జరుగుతుంటాయి. అందువల్ల పాప్స్మియర్ ఒక్కటీ స్పాటింగ్ ఎందుకు అవుతున్నదో తెలుసుకునేందుకు సరిపోదు.
ఇంకా ఏమైనా స్కానింగ్లు చేశారా… అబ్డామిన్, పెల్విక్ స్కాన్లు తీయాలి. అక్కడేమన్నా తేడా ఉంటే ఎండోస్కోపీ ద్వారా పొరను తీసి హిస్టో పాథాలజిస్ట్కు పంపుతారు. థైరాయిడ్ కూడా ఇలాంటి ఇబ్బందికి దారి తీయొచ్చు. షుగర్, బీపీలు నియంత్రణలోనే ఉన్నాయా చూపించుకోండి. కిడ్నీల పనితీరు, లిపిడ్ ప్రొఫైల్ కూడా పరిశీలించాలి. మరో విషయం ఏమిటంటే రక్తం పల్చబడటానికి మందులు ఏమైనా వాడుతున్నారా? వాటి వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమగ్రమైన పరీక్షలు చేస్తే తప్ప మీ విషయంలో స్పాటింగ్ ఎందుకు కనిపిస్తున్నదో చెప్పలేం!